Share News

ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!

ABN , First Publish Date - 2023-10-31T16:07:19+05:30 IST

2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.

ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!

వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదు కావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లలో ఒకటో రెండో సంచలనాలు నమోదయ్యేవి. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో నాలుగు సంచనాలు రావడం విశేషం. 2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ మ్యాచ్‌లలో రెండో స్థానంలో నిలవడమే కాకుండా సూపర్ సిక్స్‌లో శ్రీలంక, జింబాబ్వే, న్యూజిలాండ్‌లను ఓడించి ఏకంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే తరహాలో ఆప్ఘనిస్తాన్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. మెగా టోర్నీలో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఆప్ఘనిస్తాన్ మట్టి్కరిపించింది. అయితే ఇంగ్లండ్ వైఫల్యం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గెలిచిందని చాలా మంది భావించారు. కానీ పాకిస్థాన్‌పైనా ఆప్ఘనిస్తాన్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఇంతటితో ఆగకుండా మరో బలమైన జట్టు శ్రీలంకను కూడా ఆప్ఘనిస్తాన్ ఓడించింది. దీంతో ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు సెమీస్ రేసులో నిలిచింది.

కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి. వాళ్లకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ తప్పకుండా ఆప్ఘనిస్తాన్ గెలవాలి. అంతేకాకుండా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆప్ఘనిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. 2003లో కెన్యాతో ఆడేందుకు న్యూజిలాండ్ నిరాకరించడంతో కెన్యా గెలిచినట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో కెన్యా పని సులువైంది. కానీ ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ మాత్రం తమ ప్రదర్శన మీదే పూర్తిగా ఆధారపడింది. ముఖ్యంగా అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు పట్టుదలతో రాణిస్తూ ఆప్ఘనిస్తాన్‌కు విజయాలు కట్టబెడుతున్నారు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ఫజల్లా ఫారుఖీ అదరగొడుతున్నారు. బ్యాటింగ్‌లో గుర్భాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా, ఒమర్ జాయ్ రాణిస్తున్నారు. అయితే ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే మిగతా మ్యాచ్‌ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాలలో ఒక జట్టు అన్ని మ్యాచ్‌లు ఓడిపోవాలి.

Updated Date - 2023-10-31T16:07:19+05:30 IST