Asia Cup 2023: కుల్‌దీప్ మాములోడు కాదు.. కుంబ్లేకు సాధ్యం కాని రికార్డును పట్టేశాడు

ABN , First Publish Date - 2023-09-13T16:24:12+05:30 IST

అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని కుల్‌దీప్ అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్‌గా అతడు రికార్డు సాధించాడు.

Asia Cup 2023: కుల్‌దీప్ మాములోడు కాదు.. కుంబ్లేకు సాధ్యం కాని రికార్డును పట్టేశాడు

టీమిండియాలో ఒకే ఒక బౌలర్ గురించి అందరిలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. అతడు ఎవరో కాదు చైనామన్ బౌలర్ కుల్‌దీప్ యాదవ్. ఆసియా కప్‌లో తన ఎంపిక గురించి విమర్శలు చేసిన వారికి తన ప్రదర్శనతోనే సమాధానం ఇస్తున్నాడు. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5 వికెట్లతో రాణించిన కుల్‌దీప్ వరుసగా రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై 4 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని కుల్‌దీప్ అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్‌గా అతడు రికార్డు సాధించాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు కూడా దక్కని ఈ ఫీట్‌ను కుల్‌దీప్ సాధించడం గమనించాల్సిన విషయం.

ఇది కూడా చదవండి: Asia Cup 2023: ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడాలంటే జరగాల్సింది ఇదే!

ఓవరాల్‌గా అత్యంత వేగంగా వన్డేల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్న స్పిన్నర్లలో కుల్‌దీప్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు. 88 మ్యాచ్‌లు ఆడి అతడు ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ మాజీ ఆటగాడు సక్లాయిన్ ముస్తాక్ 78 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సంచలన ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్(80), శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్(84) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇండియన్ బౌలర్లకు సంబంధించి గతంలో అజిత్ అగార్కర్ 97 వన్డే మ్యాచ్‌ల్లో 150 వికెట్లను సాధించగా.. జహీర్ ఖాన్ 103 మ్యాచ్‌ల్లో, అనిల్ కుంబ్లే 106 మ్యాచ్‌ల్లో, ఇర్ఫాన్ పఠాన్ 106 మ్యాచ్‌లలో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నారు.

Updated Date - 2023-09-13T16:24:12+05:30 IST