KL Rahul: అంతలేదు.. దానిని అతిగా అంచనా వేస్తున్నారు!

ABN , First Publish Date - 2023-03-07T17:28:31+05:30 IST

ఇటీవలి కాలంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)పై జరుగుతున్నంత చర్చ

KL Rahul: అంతలేదు.. దానిని అతిగా అంచనా వేస్తున్నారు!

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)పై జరుగుతున్నంత చర్చ మరెవరి విషయంలోనూ జరగడం లేదు. అటు సోషల్ మీడియాలనూ, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ రాహుల్‌పైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పటికీ అతడికి జట్టులో చోటు లభిస్తుండడం ఒక కారణమైతే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అతడిని తప్పించడం మరో కారణం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్టులో చోటు దక్కుతుందో, లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్ట్రైక్ రేటింగ్ ముఖ్యం కాదు

తన ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జెర్సీ లాంచింగ్ ఈవెంట్‌కు హాజరైన రాహుల్.. టీ20ల్లో ‘స్ట్రైక్ రేట్’(strike-rates)పై అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. స్ట్రైక్ రేట్‌ను అతిగా అంచనా వేస్తున్నట్టు చెప్పాడు. తాను గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని గుర్తు చేశాడు. లక్ష్యానికి తగ్గట్టుగా ఆడాలని, అది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుందని అన్నాడు.

‘‘స్ట్రైక్ రేట్‌ను అతిగా అంచనా వేస్తున్నారని అనిపిస్తోంది. అది డిమాండ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. మీరు 140 పరుగులను ఛేదించాల్సి వచ్చినప్పుడు 200 స్ట్రైక్ రేట్ అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితిపై అది ఆధారపడి ఉంటుంది’’ అని రాహుల్ పేర్కొన్నాడు.

లక్నో ఫ్రాంచైజీ మెటార్ అయిన గౌతం గంభీర్(Gautam Gambhir) కూడా జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్‌పై ప్రశంసలు కురిపించాడు. రాహుల్ లాంటి స్థిరమైన కెప్టెన్ జట్టుకు ఉండడం అదృష్టమన్నాడు.

ప్రశ్నార్థకంగా రాహుల్ భవితవ్యం

భారత జట్టులో రాహుల్ స్థానం గత కొన్ని నెలలుగా ప్రశ్నార్థకంగా మారింది. మూడు ఫార్మాట్లలోనూ రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 109 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 48.01 సగటు, 136.22 స్ట్రైక్‌రేట్‌తో 3,889 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో బ్యాట్‌తో రాణిస్తున్నప్పటికీ ఆడిన నాలుగు ఫ్రాంచైజీలకు టైటిల్ అందించలేకపోయాడు.

ఇది కూడా చదవండి

Ahmedabad Test: నాలుగో టెస్టు ముందు టీమిండియాకు రికీ పాంటింగ్ అద్భుత సలహా!

Updated Date - 2023-03-07T17:28:31+05:30 IST