India vs Australia: స్పిన్నే ఎదురుతన్నింది.. ఢిల్లీ టెస్టులో టీమిండియా నెగ్గాలంటే శ్రమించాలి

ABN , First Publish Date - 2023-02-18T17:33:22+05:30 IST

తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో నాగపూర్ లో జరిగిన తొలి టెస్టులో బరిలో దిగిన భారత్.. ఆస్ట్రేలియాను రెండున్నర రోజుల్లోనే మట్టికరిపించింది

India vs Australia: స్పిన్నే ఎదురుతన్నింది.. ఢిల్లీ టెస్టులో టీమిండియా నెగ్గాలంటే శ్రమించాలి

న్యూఢిల్లీ: తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో నాగపూర్ లో జరిగిన తొలి టెస్టులో బరిలో దిగిన భారత్.. ఆస్ట్రేలియా(Australia)ను రెండున్నర రోజుల్లోనే మట్టికరిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, లోయరార్డర్ దయతో బ్యాటింగ్ లో గట్టెక్కింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో మనకిక ఎదురే లేదని అభిమానులు భావించారు. కానీ, ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా(Team India)ను అదే స్పిన్ బౌలింగ్ దెబ్బకొట్టింది. తొలి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలో దిగి ఘోరంగా ఓటమిపాలైన ఆస్ట్రేలియా.. మరోసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తపడింది. ఫలితంగా ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో కంగారూ జట్టు టీమిండియాపై ఆధిపత్యం సాధించే స్థితిలో నిలిచింది.

బౌలింగ్ భళా.. బ్యాటింగ్ డీలా

ఢిల్లీ టెస్టులో శుక్రవారం మొదటి రోజే ఆసీస్ ను టీమిండియా ఆలౌట్ చేసింది. 78.4 ఓవర్లే క్రీజులో నిలిచిన ఆసీస్ బ్యాటర్లు 263 పరుగులకు ఆలౌటయ్యారు.

జడేజా (3/68), అశ్విన్ (3/57)తో పాటు పేసర్ మహమ్మద్ షమీ (4/60) కూడా ప్రతిభ చూపడంతో కంగారూలకు కోలుకునే అవకాశమే లేకపోయింది. ఓపెనర్ ఖవాజా (125 బంతుల్లో 81, 12 ఫోర్లు, సిక్స్), పీటర్ హ్యాండ్స్ కాంబ్ (142 బంతుల్లో 42 నాటౌట్, 9 ఫోర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఇక తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన టీమిండియా రోజు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 21పరుగులు చేసింది.

రెండో రోజు గండం

రెండో రోజు బ్యాటింగ్ కు దిగాక కాని.. ఆసీస్ స్పిన్నర్ల జోరు చూశాక కాని.. టీమిండియాకు అసలు కష్టాలు ఏమిటో తెలిసిరాలేదు. కెప్టెన్ రోహిత్

శర్మ (69 బంతుల్లో 32, 2 ఫోర్లు) ఆసీస్ స్పిన్నర్లకు ఎదురునిలిచినా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 17, 1 సిక్స్) పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ వెనుదిరిగాడు. వందో టెస్టు ఆడుతున్నది వాల్ చతేశ్వర్ పుజారా (0) నాథన్ లయన్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. మాజీ

కెప్టెన్ విరాట్ కోహ్లి (84 బంతుల్లో 44, 4 ఫోర్లు) ఓవైపు క్రీజులో పాతుకుపోయినా.. శ్రేయాస్ అయ్యర్ (4), ఆంధ్రా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (6) విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (74 బంతుల్లో 26, 4 ఫోర్లు) కాసేపు క్రీజులో నిలిచాడు.

స్పిన్ ఆల్ రౌండర్లే దిక్కు

తొలి టెస్టులో టీమిండియాను గట్టెక్కించింది స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel). ఈసారి అక్షర్ (115 బంతుల్లో 74, 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)కు అశ్విన్(Ravichandran Ashwin) తోడయ్యాడు. వీరిద్దరూ నిలవకుంటే జట్టు పూర్తిగా వెనుకబడేదే. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన స్థితిలో 8వ వికెట్ కు 114 పరుగులు జోడించిందీ జంట. చివరకు అక్షర్ 74 పరుగుల వద్ద ఔట్ కాగా.. షమీ (2) వెనుదిరగడంతో 262 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా కంటే 1 పరుగు వెనుకబడింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో కున్ మన్ (2/72), లయన్ (5/67), మర్ఫీ (2/53) రాణించారు.

కుప్పకూల్చిన లయన్

భారత ఇన్నింగ్స్ ను కుప్పకూల్చింది మాత్రం నాథన్ లయన్(Nathan Lyon) అనే చెప్పాలి. కోహ్లి మినహా మొదటి ఐదు వికెట్లలో నాలుగు అతడివే. మరీ ముఖ్యంగా రోహిత్, పుజారాలను అతడు ఔట్ చేసిన బంతులు అద్భుతం. స్పిన్ కు విపరీతంగా సహకరిస్తున్న పిచ్ పై లయన్ చెలరేగాడు. తొలి సెషన్ లోనే అతడిని ఎదుర్కొనడం చాలా కష్టంగా మారింది. తోడుగా కున్ మన్, మర్ఫీలు చెలరేగడంతో టీమిండియా బ్యాట్స్ మెన్ పరుగులు చేయలేకపోయారు. అక్షర్, అశ్విన్ పోరాడకుంటే మన జట్టు కు ఆ మాత్రం స్కోరైనా వచ్చేది కాదు.

నాలుగో ఇన్నింగ్స్ కష్టమే..

ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఆసీస్ వేగంగా ఆడాలని చూస్తోంది. ఓపెనర్ ఖవాజా (6) వికెట్ ను తొందరగానే కోల్పోయినా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ లబుషేన్ దూకుడు చూపుతున్నారు. పది ఓవర్లలోపే స్కోరు 50 దాటింది. రెండో రోజు ఆట ముగింపులో.. నైట్ వాచ్ మన్ గా టెయిలెండర్లను కాకుండా నంబర్ వన్ బ్యాట్స్ మన్ అయిన లబుషేన్ ను పంపడమే ఆసీస్ ఆలోచనా ధోరణికి నిదర్శనం. ఇక ఇప్పటినుంచి వారు చేసే ప్రతి పరుగూ కీలకమే. అందులోనూ ఆసీస్ కు మనలాగే లోతైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అన్నింటి కంటే ముఖ్యం..

భారత్ నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి రావడం. ఢిల్లీ పిచ్ పై మూడో ఇన్నింగ్స్ బ్యాటింగే కష్టంగా ఉంది. ఇక ఛేదనలో నాలుగో ఇన్నింగ్స్ అంటే అది ఎంత స్వల్ప లక్ష్యమైనా కష్టమే. మరి ఆసీస్ స్పిన్ త్రయాన్ని ఎదుర్కొంటూ టీమిండియా గెలుపు తీరం ఎలా చేరుతుందో చూడాలి. కాగా, రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషేన్ (16) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యమైన ఒక్క పరుగును కలుపుకుంటే ఆసీస్ లీడ్ ప్రస్తుతం 62 పరుగులుగా ఉంది.

Updated Date - 2023-02-18T17:49:29+05:30 IST