T20 Cricket: టీ20 క్రికెట్‌లో పెనుసంచలనం... 10 పరుగులకే జట్టంతా ఆలౌట్

ABN , First Publish Date - 2023-02-27T16:53:26+05:30 IST

టీ20 క్రికెట్ అంటే ఆ మజానే వేరు. స్టేడియంలో కురిసే పరుగుల వాన ప్రేక్షకులను

T20 Cricket: టీ20 క్రికెట్‌లో పెనుసంచలనం... 10 పరుగులకే జట్టంతా ఆలౌట్

కార్గజెనా(స్పెయిన్): టీ20 క్రికెట్ అంటే ఆ మజానే వేరు. స్టేడియంలో కురిసే పరుగుల వాన ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. టీ20 క్రికెట్‌లో జరిగేది ఇదే. బంతికి బ్యాట్‌కు జరిగే యుద్ధంలో చాలా వరకు బ్యాటే విజయం సాధిస్తుంది. అయితే, స్పెయిన్‌ జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇందుకు భిన్నంగా జరిగింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే చాపచుట్టేసింది.

‘ఇస్లే ఆఫ్ మ్యాన్’(Isle of Man)-‘స్పెయిన్’(Spain) జట్ల మధ్య ఆదివారం లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులకే కుప్పకూలింది. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ స్కోరు సాధించిన చెత్త రికార్డు ఇప్పటి వరకు సిడ్నీ థండర్స్ పేరున ఉండగా ఇప్పుడా రికార్డును ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు తుడిచిపెట్టేసి సరికొత్త చెత్త రికార్డును మూటగట్టుకుంది.

2022-23 బిగ్‌బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్‌(Adelaide Strikers)తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్(Sydney Thunder) 15 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక, తాజా మ్యాచ్‌లో ఏడుగురు ఆటగాళ్లు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ముగ్గురు ఆటగాళ్లు చెరో రెండు పరుగుల చొప్పున చేయగా, జోసెఫ్ బరోస్ చేసిన నాలుగు పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్లు అతిఫ్ మెహమూద్(Atif Mehmood), మహమ్మద్ కమ్రాన్ ( Mohammad Kamran) చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. కమ్రాన్ హ్యాట్రిక్ తీసుకున్నాడు.

11 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పానిష్ జట్టు రెండు బంతుల్లోనే విజయం సాధించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

కాగా, 2019లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నెల 25న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ 66 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు ఆ జట్టు 16 టీ20లు ఆడింది. వీటిలో 8 మ్యాచుల్లో గెలిచింది. ఏడింటిలో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. స్పెయిన్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 0-5తో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

Updated Date - 2023-02-27T18:28:13+05:30 IST