IND Vs BAN: టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులో ఏకంగా ఐదు మార్పులు

ABN , First Publish Date - 2023-09-15T14:58:25+05:30 IST

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు.

IND Vs BAN: టాస్ గెలిచిన టీమిండియా.. జట్టులో ఏకంగా ఐదు మార్పులు

ఆసియా కప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంక వంటి పటిష్ట జట్లను ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత్.. ఈరోజు బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో తలపడుతోంది. దీంతో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావించింది. ఈ మేరకు ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంకతో తలపడిన జట్టులో ఐదుగురిని మారుస్తున్నట్లు రోహిత్ వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణలను తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: Team india: ఫిట్‌నెస్‌లో సన్‌రైజర్స్ ఆటగాడే టాప్.. కోహ్లీ, గిల్‌ను మించిపోయాడుగా..!!

కాగా తెలుగు తేజం తిలక్ వర్మకు అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి మ్యాచ్. గతంలో వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20ల్లో ఆడిన తిలక్ వర్మ ఇప్పుడు వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్‌కు ముందు అతడికి క్యాప్ అందజేశాడు. ఆసియా కప్‌కు ఎంపికైన తిలక్ వర్మ వన్డే ప్రపంచకప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన తిలక్ వర్మ తన తొలి వన్డేలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. అటు ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. పాకిస్థాన్, శ్రీలంకతో మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగించిన తరహాలో ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆకాశం 90 శాతం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Updated Date - 2023-09-15T15:00:50+05:30 IST