IND vs AUS: భారత్‌ వన్డేలకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా..

ABN , First Publish Date - 2023-03-14T18:33:44+05:30 IST

భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్(One Day Series) కోసం ఆస్ట్రేలియా(Australia) జట్టును ప్రకటించింది.

IND vs AUS: భారత్‌ వన్డేలకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా..

న్యూఢిల్లీ: భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్(One Day Series) కోసం ఆస్ట్రేలియా(Australia) జట్టును ప్రకటించింది. పాట్ కమిన్స్(Pat Cummins) అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్‌(Steve Smith)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్న కమిన్స్ తల్లి మరియా కమిన్స్(Maria Cummins) ఆరోగ్యం విషమించడంతో రెండో టెస్టు ముగిసిన తర్వాత కమిన్స్ స్వదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత రావాలనుకున్నప్పటికీ తల్లి కోలుకోకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. భారత్‌తో నాలుగు టెస్టు సమయంలో మరియా కమిన్స్ మృతి చెందారు. దీంతో పాట్ కమిన్స్ అక్కడే ఉండిపోయాడు.

కమిన్స్ స్వదేశంలోనే ఉన్నాడని, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ తెలిపాడు. కమిన్స్ స్థానంలో స్మిత్ జట్టును నడిపిస్తాడని పేర్కొన్నాడు. రెండో టెస్టులో గాయపడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు అందుబాటులోకి వచ్చాడు. మడమ గాయంతో టెస్టులకు దూరమైన మిచెల్ మార్ష్ కూడా వన్డేలకు అందుబాటులోకి వచ్చినట్టు కోచ్ తెలిపాడు.

గాయంతో బాధపడుతున్న మరో ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ మాత్రం వన్డేలకు దూరమయ్యాడు. మరో ఆటగాడు జే రిచర్డ్‌సన్ ఇంకా కోలుకోకపోవడంతో నాథన్ ఎల్లిస్‌కు స్థానం దక్కింది. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, అలెక్స్ కేరీ, నాథన్ ఎల్లిస్, కేమరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా.

వన్డే సిరీస్

* మార్చి 17న ముంబలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే

* మార్చి 19న వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రెండో వన్డే

* మార్చి 22 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మూడో వన్డే

Updated Date - 2023-03-14T18:33:44+05:30 IST