Border-Gavaskar Trophy: కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ కోల్పోవడంపై ఒక్క ముక్కలో తేల్చేసిన రవిశాస్త్రి

ABN , First Publish Date - 2023-02-26T18:22:56+05:30 IST

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul) ఇప్పుడు ఇంటాబయటా తీవ్ర విమర్శలు

Border-Gavaskar Trophy: కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ కోల్పోవడంపై ఒక్క ముక్కలో తేల్చేసిన రవిశాస్త్రి

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul) ఇప్పుడు ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఫామ్ కోల్పోయి బ్యాటెత్తేస్తున్నప్పటికీ జట్టులో మాత్రం చోటు దక్కించుకుంటూనే ఉన్నాడు. దీంతో అటు బీసీసీఐతోపాటు ఇటు రాహుల్‌(Rahul)పైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతోమంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తుంటే ఏడాది కాలంగా ఒక్క అర్ధ సెంచరీ కూడా లేని రాహుల్‌(Rahul)కు జట్టులో చోటెలా దక్కుతోందంటూ బీసీసీఐపై అభిమానులు మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు.

విమర్శలకు దిగొచ్చిన బీసీసీఐ ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సమయంలో కేఎల్ రాహుల్(Rahul) నుంచి వైస్ కెప్టెన్సీ ట్యాగ్‌ను లాగేసుకుంది. అంతేకాదు, మరెవరికీ దానిని కట్టబెట్టలేదు కూడా. అయితే, జట్టులో మాత్రం రాహుల్‌(KL Rahul)కు చోటిచ్చింది. ఇది కూడా బోల్డన్ని విమర్శలకు తావిచ్చింది. కాగా, రాహుల్ నుంచి వైస్ కెప్టెన్సీ ట్యాగ్‌ను లాగేసుకోవడంపై టీమిండియా మాజీ సారథి, మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravishastri) స్పందించాడు. నిజానికసలు భారత జట్టు కెప్టెన్‌కు డిప్యూటీతో పనే లేదంటూ ఒక్క ముక్కలో తేల్చి పడేశాడు.

ఐసీసీ రివ్యూ పోడ్‌కాస్ట్‌లో రవి మాట్లాడుతూ.. స్వదేశంలో భారత్‌కు వైస్ కెప్టెన్ అవసరం లేదన్న విషయాన్ని తాను నమ్ముతానన్నాడు. జట్టు మేనేజ్‌మెంట్ వైస్ కెప్టెన్‌ను నిర్ణయిస్తుందన్న రవిశాస్త్రి.. రాహుల్(Rahul) గురించి, అతడి మానసిక స్థితి గురించి కూడా వారికి తెలుసన్నాడు. శుభమన్ గిల్ లాంటి వారిని ఎలా చూడాలో కూడా తెలుసన్నాడు. భారత జట్టుకు వైస్ కెప్టెన్‌ అవసరం లేదనే తాను నమ్ముతానన్నాడు.

11 మంది అత్యుత్తమ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాలని కోరుకుంటానన్నాడు. ఒకవేళ కెప్టెన్ కనుక మైదానాన్ని విడిచిపెట్టాల్సి వస్తే అప్పుడు హైరానా పడిపోవాల్సిన అవసరం కూడా లేదన్నాడు. జట్టులోని మరో ఆటగాడికి ఆ బాధ్యత అప్పగిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చాడు. అతడు సరైన ప్రదర్శన చేయకపోతే అప్పుడు ఇంకెవరినైనా తీసుకోవచ్చని, దీనికి వైస్ కెప్టెన్ అనే ట్యాగ్ ఉండాల్సిన అవసరం లేదన్నాడు.

స్వదేశంలో వైస్ కెప్టెన్సీని తాను ఎప్పుడూ ఇష్టపడనని రవిశాస్త్రి(Ravishastri) తేల్చి చెప్పాడు. అయితే, విదేశాల్లో పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయని అన్నాడు. ఓవర్సీస్‌లో ప్రైమ్ ఫామ్ కావాలని, రెడ్ హాట్‌గా ఉండే శుభమన్ గిల్ లాంటి వారు కావాలని అన్నాడు. రాహుల్ పేలవ ప్రదర్శనపై మాట్లాడుతూ.. అతడు తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు భారీ ప్రదర్శన చేయాలన్నాడు. అతడు గొప్ప ఆటగాడేనని, కాకపోతే ఇక్కడ ప్రదర్శనే ముఖ్యమన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నాడు. నైపుణ్యం ఉన్న ఎంతోమంది ఆటగాళ్లు ఇప్పుడు టీమిండియా తలుపులు తడుతున్నట్టు రవిశాస్త్రి చెప్పాడు.

Updated Date - 2023-02-26T18:53:29+05:30 IST