Share News

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధోనీ జెర్సీకి అరుదైన గౌరవం

ABN , Publish Date - Dec 15 , 2023 | 04:45 PM

Jersey Number 7: క్రికెట్ ప్రపంచంలో సచిన్‌కు ఎంత పేరు వచ్చిందో ధోనీకి అంతే పేరు వచ్చింది. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్‌ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు ప్రపంచకప్‌లను అందించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు.

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధోనీ జెర్సీకి అరుదైన గౌరవం

క్రికెట్ ప్రపంచంలో సచిన్‌కు ఎంత పేరు వచ్చిందో ధోనీకి అంతే పేరు వచ్చింది. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్‌ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు ప్రపంచకప్‌లను అందించి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. టీమిండియాకు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం ఇస్తున్నామని.. ధోనీ 7వ నంబర్ జెర్సీని ఎవరూ ఎంచుకోవద్దని ప్రస్తుత ఆటగాళ్లకు సూచించింది.

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో ర‌నౌట్‌గా వెనుదిరిగిన ధోనీ ఆ క్షణ‌మే ఆట‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణయించుకున్నాడు. అయితే.. త‌న నిర్ణయాన్ని మాత్రం 2020 ఆగస్టు 15న ప్రక‌టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన మెగా టీ20 లీగ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపి తన కెప్టెన్సీలోని పదును ధోనీ మరోసారి చూపించాడు. ఇప్పుడు బీసీసీఐ ఇచ్చిన అరుదైన గౌరవంతో ధోనీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 04:45 PM