Bangladesh: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

ABN , First Publish Date - 2023-03-14T19:28:00+05:30 IST

షకీబల్ హసన్( Shakib Al Hasan) సారథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh) క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర

Bangladesh: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

ఢాకా: షకీబల్ హసన్( Shakib Al Hasan) సారథ్యంలో బంగ్లాదేశ్(Bangladesh) క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌(Engaland)తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిటన్ దాస్ 57 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బ్యాటంగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలుత గెలుపు దిశగా పయనించింది. ఒకానొక దశలో వికెట్ నష్టానికి 100 పరుగులతో బలంగా కనిపించింది.

అయితే, ఆ తర్వాత బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలైంది. చివరికి 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. డేవిడ్ మలాన్ 53, కెప్టెన్ జోస్ బట్లర్ 40 పరుగులు చేశారు.

అంతకుముందు చాటోగ్రామ్‌లో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్.. ఈ నెల 12న ఢాకాలో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించిన టీ20 సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.

Updated Date - 2023-03-14T19:28:00+05:30 IST