Babar Azam: మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి.. స్టేడియంలో పాక్ కెప్టెన్!

ABN , First Publish Date - 2023-02-05T17:36:36+05:30 IST

పాకిస్థాన్‌లోని క్వెట్టా(Quetta)లో స్టేడియం సమీపంలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది

Babar Azam: మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి.. స్టేడియంలో పాక్ కెప్టెన్!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా(Quetta)లో స్టేడియం సమీపంలో ఆదివారం ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam), మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) వంటి వారు స్టేడియంలోనే ఉన్నారు. పేలుడుతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని వెంటనే డ్రెస్సింగ్‌ రూముకు తరలించి భద్రత కల్పించారు. స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియానికి కొన్ని మైళ్ల దూరంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని డ్రెస్సింగ్‌ రూముకు తరలించి భద్రత కల్పించారు.

క్వెట్టాలోని నవాబ్ అక్బర్ బుగ్టి స్టేడియంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుండగా పోలీస్ లైన్స్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు ముగిశాయని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు.

ఈ పేలుడుకు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) బాధ్యత వహించింది. అది తమ పనేనని ప్రకటించింది. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడినట్టు తెలిపింది.

పీఎస్ఎల్ వేదికల్లో క్వెట్టాను కూడా చేర్చాలని బలూచిస్థాన్ అభిమానులు పట్టుబట్టడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇక్కడ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్-పెషావర్ జల్మి మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఉగ్రదాడి జరగడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

ఉగ్రదాడి జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూముకు తరలించి భద్రత కల్పించారు. ఆ తర్వాత పోలీసులు అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగానే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.

టీటీపీ ఉగ్రదాడులకు దిగడం ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో పరిపాటిగా మారింది. పెషావర్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - 2023-02-05T17:36:38+05:30 IST