Asian Games: టెన్నిస్‌లో స్వర్ణం గెలిచిన భారత్

ABN , First Publish Date - 2023-09-30T14:34:53+05:30 IST

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 9వ స్వర్ణం చేరింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ జోడి రోహన్ బోపన్న-రుతుజ భోసలే బంగారు పతకాన్ని గెలిచింది.

Asian Games: టెన్నిస్‌లో స్వర్ణం గెలిచిన భారత్

హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 9వ స్వర్ణం చేరింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ జోడి రోహన్ బోపన్న-రుతుజ భోసలే బంగారు పతకాన్ని గెలిచింది. చైనీస్ తైపీకి చెందిన సంగ్-లియాంగ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ భారత్ జోడి 2-6 6-3 10-4 తేడాతో విజయం సాధించింది. ఫైనల్ పోరులో మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న భారత జోడి పసిడిని ఒడిసిపట్టింది. ఆసియా క్రీడలు 2023లో టెన్నిస్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. అలాగే తొలి స్వర్ణం కావడం గమనార్హం. ఇది వరకే పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్‌ జోడి రజతం గెలిచింది. అయితే ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో రెండు పతకాలు మాత్రమే గెలుచుకోవడం ఈ శతాబ్దంలో భారత్‌కు ఇదే మొదటిసారి. 2002లో నాలుగు పతకాలు, 2010లో ఐడు, 2014లో నాలుగు, 2018లో మూడు పతకాలు దక్కాయి. దీంతో ఈ సారి టెన్నిస్‌లో మన క్రీడాకారులు ఆశించినమేర రాణించలేకపోయారనే చెప్పుకోవాలి.


అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ ద్వయం సరబ్‌జోత్ సింగ్, దివ్య తాడిగోల్ రజత పతకం గెలిచింది. ఫైనల్ పోరులో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జోడి రజతంతో సరిపెట్టుకుంది. 16 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిన బోవెన్ జాంగ్ రాంక్సిన్ జియాంగ్‌లతో కూడిన చైనా జోడి బంగారు పతకం కైవసం చేసుకుంది. మొత్తంగా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 35కు చేరుకుంది. అందులో షూటింగ్ విభాగంలోనే 19 పతకాలు రావడం గమనార్హం. కాగా నేడు భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-30T14:34:53+05:30 IST