Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు బంగారమే ఎందుకు?.. స్థోమతలేనివారు ఇలా చేస్తే పసిడి కొన్నట్టే...

ABN , First Publish Date - 2023-04-21T22:59:04+05:30 IST

అక్షయ తృతీయ - పసిడికి అసలు సంబంధం ఏమిటి?. ఆ రోజున బంగారాన్ని కొనేందుకు ప్రాధాన్యత ఎందుకు?. ఇందుకు కారణాలు ఏమిటి?.. ఏప్రిల్ 22న(శనివారం) అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం...

Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు బంగారమే ఎందుకు?.. స్థోమతలేనివారు ఇలా చేస్తే పసిడి కొన్నట్టే...

అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) పేరు చెబితే బంగారం కొనుగోళ్లు (Gold Purchase) గుర్తుకొస్తాయి. పసిడి విక్రయాలు పెరిగి బులియన్ మార్కెట్లు కళకళ్లాడుతుంటాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు పసిడి వ్యాపారులు సైతం డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. గిఫ్ట్ వోచర్లు వంటి పేర్లతో ముందుకొస్తుంటారు. ఇదంతా చూస్తుంటే అక్షయ తృతీయ అంతా బంగారం చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరి అక్షయ తృతీయ - పసిడికి అసలు సంబంధం ఏమిటి?. ఆ రోజున బంగారాన్ని కొనేందుకు ప్రాధాన్యత ఎందుకు?. ఇందుకు కారణాలు ఏమిటి?.. ఏప్రిల్ 22న(శనివారం) అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలను పరిశీలిద్దాం...

హిందూ సంప్రదాయంలో విశిష్ఠ ప్రత్యేకత ఉన్న అక్షయ తృతీయను హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో మూడో రోజున జరుపుకుంటారు. అక్ష తీజ్ (Akha Teej) లేదా అక్తి (Akti) గా కూడా పిలిచే ఈ రోజు ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంటుంది. భారత్‌లో హిందువులు, జైనులు జరుపుకుంటారు. ఒక్క ఇండియాలోనే కాకుండా నేపాల్, ఇతర దేశాల్లో కూడా అక్షయ తృతీయను నిర్వహిస్తుంటారు. అక్షయ తృతీయ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే రోజుగా విశ్వసిస్తారు. ఈ రోజున పొందే డబ్బు లేదా బంగారం శాశ్వతమని భావిస్తారు. కొత్త ప్రయత్నాలు విజయాలను చేకూర్చుతాయని, నూతన పెట్టుబడులు చక్కటి ఫలాలను అందిస్తాయని హిందువులు విశ్వసిస్తారు. సిరిసంపదల పెరుగుదల, అదృష్టానికి ప్రతీకగా నమ్ముతారు. అందుకే శుభప్రదమైన ఈ రోజున బంగారం లేదా ఇతర విలువైన వస్తువుల కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలతోపాటు అవసరంలో ఉన్నవారికి ఆహారం, దుస్తులు, డబ్బు దానం చేస్తారు.

Untitled-2.jpg

బంగారమే కొనాలా?

ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. తిథి ఏప్రిల్ 22 శనివారం ఉదయం 07:49 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 ఉదయం 07:47 వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం, ఏప్రిల్ 22నే అక్షయ తృతీయను జరుపుకుంటారు. బంగారం కొనుగోలుకు ఉదయం 07:49 నుండి ప్రారంభమై.. ఏప్రిల్ 23 ఉదయం 05:48 వరకు మంచి సమయంగా ఉంది. అయితే ఈ సమయంలో పసిడి మాత్రమే కాదు. ఇతర విలువైన వస్తువులు ఏవైనా కొనుగోలు చేయవచ్చు. వాహనాలు లేదా ఇల్లు వంటికి కొనుగోలు చేయవచ్చు.

స్థోమత లేకవాళ్లు ఇలా చేస్తే బంగారం కొన్నట్టే లెక్క ...

కొనగలిగే స్థోమత ఉన్నవాళ్లు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటారు. మరి అంత స్థోమతలేని వాళ్ల సంగతేంటి?.. అంటే చింతించాల్సిన అవసరమేమీ లేదు. పసిడి కొనుగోలుతో సమానమైన పనులున్నాయి. వాటిని ఆచరిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.. భూమి బంగారం అంత విలువైనది. కాబట్టి అక్షయ తృతీయ నాడు ఇంట్లో ఏదైనా మట్టి కుండ లేదా మట్టి పాత్రను ఉంచాలి. అక్షయ తృతీయ నాడు పూజ గదిలో కొన్ని దూది బంతులను ఉంచితే ఇది కూడా బంగారాన్ని ఉంచుకోవడంతో సమానమనే నమ్మకం ఉంది. ఇక ఒక పిడికెడు పసుపు ఆవాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం ఉంది. ఈ రోజున నదులలో పుణ్యస్నానం చేసి నీరు, ధాన్యాలు, చెరకు, పెరుగు, సత్తు, పండ్లు, బిందెలు, వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. మరోవైపు తెల్లని పూలతో దేవుడిని పూజించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు పెరుగుతుంది. ఈ రోజున పేదలకు దానం చేయడం, ముఖ్యంగా ఆహారం, ఇది చెడు కర్మలను తగ్గిస్తుందనే విశ్వాసం ఉంది. కాబట్టి బంగారం కొనే స్థోమతలేనివాళ్లు వీటిని ఆచరిస్తే సరిపోతుంది.

Updated Date - 2023-04-21T23:33:04+05:30 IST