Viral Video: ఈ జింక తెలివి చూస్తే షాకవుతారు.. ప్రాణాలు పోవడం ఖాయమనుకున్న సమయంలో ఎలా తప్పించుకుందో చూడండి

ABN , First Publish Date - 2023-03-29T16:40:37+05:30 IST

జింకను చిరుత ఏకంగా తన పంజా కింద నొక్కిపెట్టింది. ఇక జింకను చప్పరించేద్దాం అనుంటుండగా భలే డ్రామా జరిగింది.

Viral Video:  ఈ జింక తెలివి చూస్తే షాకవుతారు.. ప్రాణాలు పోవడం ఖాయమనుకున్న సమయంలో ఎలా తప్పించుకుందో చూడండి

అడవి అనే పదం వింటే కృూరజంతువులు, వాటి వేట గుర్తుకొస్తుంది. అడవి జంతువులు ఆహారం కోసం ఎప్పుడూ వేట మీదనే ఆధారపడతాయి. ముఖ్యంగా చిరుతపులి(Leopard) కంటికి ఏదైనా జంతువు కనబడితే ఇక అది ఆహారం అయిపోయినట్టే లెక్క. ఓ జింక అలాగే చిరుత కంట పడింది. ఆ జింకను చిరుత ఏకంగా తన పంజా కింద నొక్కిపెట్టింది. ఇక జింకను చప్పరించేద్దాం అనుంటుండగా భలే డ్రామా జరిగింది. జింక తెలివిగా అక్కడినుండి జంప్ అయ్యింది. ' అయ్యబాబోయ్ ఇంత తెలివిగా ఉందేంటి ఈ జింక' అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

జంతురాజ్యమైన అడవి(Forest)లో సాధు జంతువులు తమకు ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ వైపు నుండి వచ్చిపడుతుందోనని భయపడుతూనే బ్రతుకుతుంటాయి. సాధారణంగా పులులు, సింహాలు ఎక్కువగా టార్గెట్ చేసేది జింకలనే.. ఓ చిరుత కంటికి జింక(Deer) కనిపించింది, అది వెంటనే వేటకు దిగింది. పాపం జింక చిరుతకు సరెండర్ అయిపోయింది. జింక పరిగెత్తి పోయే ఆలోచన చేసింది కానీ చిరుత జింకను పంజా కింద నొక్కిపెట్టింది. 'నేను ఇప్పుడు పరిగెత్తాలని చూస్తే పులిమామ పీక కొరికేస్తుంది తెలివిగా ఆలోచించాలి' అని అనుకుంది. వెంటనే చనిపోయిన దానిలా ఉలుకూ పలుకూ లేకుండా అలా నేలమీద ఉండిపోయింది. 'ఇది ఎలాగుంటే మనకేంటి దీన్ని నమిలేద్దాం' అని చిరుత ప్రయత్నిస్తున్న సమయానికి హైనా(Hyena) పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది . ఆ హైనా చిరుతను అక్కడినుండి తరమింది. ఇక జింకను చీల్చుకు తిందామని పళ్ళతో జింకను పట్టుకుని అటు ఇటూ ఊపింది. కానీ చిరుత అక్కడినుండి వెళ్ళిపోకుండా చుట్టూ తచ్చాడుతుండటం చూసింది. 'ఈ చిరుత నన్ను ప్రశాంతంగా తిననిచ్చేట్టు లేదు, ఈ చచ్చిన జింక ఎక్కడికి పోతుంది, మొదట చిరుతను తరిమేస్తాను' అని జింకను వదిలి చిరుత మీదకు వెళ్ళింది.

హైనా చిరుతను తరుమడానికి వెళ్ళినప్పుడు 'సమయం లేదు మిత్రమా పారిపో..' అని జింక అంతరాత్మ జింకను హెచ్చరించినట్టైంది. చచ్చిపోయిన జంతువులా గట్టిగా బిగదీసుకుపోయి నటించిన జింక కాస్తా పైకి లేచి పరుగో పరుగు అంటూ పారిపోయింది. 'అయ్యయ్యో నోటికాడి కూడు పారిపోతోందే' అని హైనా ఆ జింక కోసం పరిగెత్తినా అప్పటికే జింక చాలా దూరం వెళ్ళిపోయింది. పిల్లలకు చెప్పే నీతి కథను తలపించే ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Figen అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జింక తెలివికి ఫిదా అవుతున్నారు. 'చచ్చినట్టు నటించడం అదను చూసి పారిపోవడం.. వామ్మో ఆ జింకకు ఎంత తెలివో' అంటున్నారు. 'అసలు చిరుత పంజా కింద ఉన్నా అది చచ్చినట్టు నటించింది అంటే ఎంత ధైర్యం దానికి, అలాంటి సందర్భాలలో తెలివి ఉపయోగించడమే నిజమైన సమయస్పూర్తి' అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Read also: Viral News: కొడుకు ఏదో చేస్తున్నాడని డౌట్.. ఎవరికీ తెలియకుండా అతడి గదిలో సీసీ కెమెరాలను ఆ తండ్రి ఏర్పాటు చేయిస్తే..


Updated Date - 2023-03-29T16:40:37+05:30 IST