Apple iPhone: 2007లో ఫోన్ కొని మర్చిపోయింది.. ఇప్పుడు వేలం వేస్తే ఎంత పలికిందంటే..!

ABN , First Publish Date - 2023-03-04T11:00:27+05:30 IST

అది 2007లో విడుదలైన ఫస్ట్ జనరేషన్ యాపిల్ ఐఫోన్ (First Generation Apple iPhone).​ ఇప్పటికీ సీల్ ​తీయలేదు.

Apple iPhone: 2007లో ఫోన్ కొని మర్చిపోయింది.. ఇప్పుడు వేలం వేస్తే ఎంత పలికిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: అది 2007లో విడుదలైన ఫస్ట్ జనరేషన్ యాపిల్ ఐఫోన్ (First Generation Apple iPhone).​ ఇప్పటికీ సీల్ ​తీయలేదు. అలా 16ఏళ్ల కింద దాన్ని కేవలం 599 డాలర్లకు మాత్రమే కొనుగోలు చేశారు. అదే ఫోన్‌ను తాజాగా వేలం వేయగా ఏకంగా రూ.52లక్షలకు అమ్ముడు పోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. అమెరికాకు చెందిన ఎల్‌సీజీ హౌస్ (LCG House) వేసిన వేలం పాటలో ఇన్వెస్టర్లు, పాత ఫోన్లు సేకరించే వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు ఈ పాత ఫోన్‌ను కొనేందుకు ఎగబడ్డారు. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర అమాంతం పెరిగిపోయింది. తొలుత ఓ 50వేల డాలర్లు వస్తాయని వేలం కంపెనీ అంచనా వేసింది. కానీ, ఆ అంచనాలు పటాపంచలు చేసి, ఈ ఫోన్ ఏకంగా 63వేల డాలర్లు రాబట్టడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. 16ఏళ్ల క్రితం టాటూ ఆర్టిస్ట్ కరెన్ గ్రీన్‌కు తన స్నేహితులు ఈ ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చారు. 2007లో కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు కరెన్ స్నేహితులు ఆమెకు గిఫ్ట్‌గా ఇలా ఐఫోన్ ఇచ్చారు. దానిని ఆమె వాడలేదు. కనీసం దాన్ని ప్యాకింగ్ కూడా తీయలేదు. అలాగే భద్రంగా దాచి పెట్టింది. ఆమె అప్పటికే సాధారణ ఫోన్‌ను ఉపయోగిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు మారాలంటే.. ఏటీ అండ్ టీ నెట్‌వర్క్‌కు మారాలి. అది ఇష్టం లేని కరెన్.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాడకుండా అలాగే దాచేసిందన్నమాట. కనీసం ఫోన్ బాక్స్ సీల్ కూడా తీయకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దాని సంగతే మరిచిపోయింది. ఈ క్రమంలో సీల్ తీయని మొబైళ్లకు అధిక ధర ఉంటుందని కొన్ని రోజుల తర్వాత ఆమెకు స్నేహితుల ద్వారా తెలిసింది. వారి మాటల విన్న ఆమెకు తనకు 2007లో గిఫ్ట్‌గా వచ్చిన ఈ ఐఫోన్ గుర్తుకు వచ్చింది.

ఇది కూడా చదవండి: వామ్మో.. డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయిన ట్రాక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..!

దాంతో 2019లో 'ద డాక్టర్ అండ్ ద దీవా షో' ద్వారా ఆ ఐఫోన్ విలువ తెలుసుకుంది. అప్పుడు దాని విలువ 5వేల డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీంతో కరెన్ వేలం నిర్వాహకులను సంప్రదించింది. ఆ తర్వాత 'ఎల్‌సీజీ ఆక్షన్స్' (LCG Auctions) అనే వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 2న ఫోన్‌ను వేలానికి ఉంచింది. మొదట ఆమె ఫోన్‌కు ఒక 50వేల డాలర్ల వరకు వస్తాయని వేలం వేసే కంపెనీ అంచనా వేసింది. అయితే, వేలంలో ఆ ఫోన్‌కు ఊహించని డిమాండ్ ఏర్పడింది. వేలంలో ప్రారంభ ధర 2,500 డాలర్లుగా నిర్ణయించారు. కానీ, వేలంలో 27 బిడ్ల తర్వాత ఈ ఐఫోన్ అనూహ్యంగా 63,356.40 డాలర్లు (రూ.52,47,303) వచ్చాయి. కేవలం 599 డాలర్లకు కొనుగోలు చేసిన ఫోన్ ఇప్పుడు ఏకంగా 63వేల డాలర్లు పలకడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఇక ఫస్ట్ జనరేషన్ ఐఫోన్‌గా వచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ 2జీ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. అలాగే 8జీబీ స్టోరేజీ, 3.5-ఇంచుల డిస్‌ప్లే, 2-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఇతడెవరో గుర్తు పట్టలేరేమో కానీ.. ఈయన వాయిస్‌ను మాత్రం వినే ఉంటారు.. 8 సార్లు ఆర్మీ రిజెక్ట్ చేసిన ఈయన కథేంటంటే..!

Updated Date - 2023-03-04T11:15:35+05:30 IST