Rahul Gandhi: పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం.. రాహుల్ గాంధీ స్పీచ్ మధ్యలో...

ABN , First Publish Date - 2023-02-07T17:54:06+05:30 IST

పార్లమెంట్ బడ్జెట్-2023 సెషన్‌లో భాగంగా లోక్‌సభలో మంగళవారం రాహుల్ గాంధీ కేంద్రంగా చోటుచేసుకున్న ఓ పరిణామం ఆసక్తిని కలిగించింది. చట్టసభ్యులతోపాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ పరిణామం వివరాలపై లుక్కేద్దాం...

Rahul Gandhi: పార్లమెంట్‌లో ఆసక్తికర సన్నివేశం.. రాహుల్ గాంధీ స్పీచ్ మధ్యలో...

ప్రేమ, శాంతి, సామరస్యాలను వ్యాపింపజేయడమే లక్ష్యమంటూ కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గతేడాది సెప్టెంబర్‌లో మొదలుపెట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఇటివలే కాశ్మీర్‌లో ముగిసింది. అలుపుసొలుపు లేకుండా 150 రోజులపాటు 4080 కిలోమీటర్ల సుదీర్ఘ కాలినడక అనంతరం ఈ యాత్ర ముగిసింది. రాహుల్ గాంధీ లక్ష్యాలు, కాంగ్రెస్ (Congress party) శ్రేణుల్లో నూతనోత్సాహం, పునరుజ్జీవానికి ఈ యాత్ర ఎంతవరకు దోహదపడిందో చెప్పలేం. కానీ రాహుల్‌ రాజకీయ పరిణితికి నిస్సందేహంగా తోడ్పడుతుందంటూ రాజకీయ నిపుణులు విశ్లేషించారు. జనాలకు మరింత చేరువవ్వడం ఖాయమంటూ అభిప్రాయాలు వెలిబుచ్చారు. మరి నిజంగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీలో జోష్ నింపిందా? పరిణితికి ఉపయోగపడిందా?. రాజకీయ పాఠాలు నేర్పిందా? సవాళ్లకు ధీటుగా, చమత్కారంగా బదులివ్వడంలో ఆయన సిద్ధహస్తులయ్యారా?.. అనే ప్రశ్నలకు ఔనని సమాధానం చెప్పలేం. కానీ పార్లమెంట్ బడ్జెట్-2023 సెషన్‌లో భాగంగా లోక్‌సభలో మంగళవారం రాహుల్ గాంధీ కేంద్రంగా చోటుచేసుకున్న ఓ పరిణామం ఆసక్తిని కలిగించింది. చట్టసభ్యులతోపాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ పరిణామం వివరాలపై లుక్కేద్దాం...

లోక్‌సభలో (Loksabha) రాష్ట్రపతి ప్రసంగానికి (president speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం (Adani-Hindenberg row) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi Govt) ప్రభుత్వంపై పదునైన మాటల తూటాలు పేల్చారు. ప్రసంగం మధ్యలో సడెన్‌గా తన వద్దనున్న పేపర్ కవర్‌ను తెరవడం మొదలుపెట్టారు. ఒక్కక్షణంపాటు రాహుల్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థంకాలేదు. ఏం జరుగుతుందో కెమెరా టీమ్ గుర్తించేలోపే.. ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలు (Gautham adani) కలిసున్న ఫొటోలను రాహుల్ ప్రదర్శించారు. ఈ ఫొటోలో మోదీ, అదానీలు ఓ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ఫొటోలతో వీరిద్దరి మైత్రికి ముడిపెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా (Om birla) జోక్యం చేసుకుంటూ.. ‘‘ సభలో పోస్టర్స్‌కు అనుమతి లేదు. మీరొక సీనియర్ సభ్యుడు కదా’’ అని సూచన చేశారు. రాహుల్ బదులిస్తూ.. ‘‘సార్ ఇది ప్రధానమంత్రి ఫొటో. పోస్టర్ కానేకాదు’’ అని జవాబిచ్చారు. రాహుల్ విసిరిన ఈ చమత్కారం ఇటు చట్టసభ్యలతోపాటు నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది. పలువురు నెటిజన్లు రాహుల్ పంచ్‌ను ట్విటర్‌ వేదికగా షేర్ చేశారు. వీటిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. ఫైరీ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు. రాహుల్ నెమ్మదిగానే మొదలుపెట్టినా బాగానే రాణిస్తున్నారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. రాహుల్‌ని ఇంతసేపు మాట్లాడనివ్వడం, టీవీల్లో చూపించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ రాహుల్ గాంధీలో భారత్ జోడో యాత్ర జోష్ నింపిందా అని చర్చించుకుంటున్నారు.

Untitled-2.jpg

అదానీ.. అదానీ.. అదానీ..

అదానీ-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Adani-Hindenberg) వ్యవహారం నేపథ్యంలో అదానీతో ముడిపెడుతూ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ (Rahul gandhi) విమర్శల వర్షం కురిపించారు. ‘‘ తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు నాకు ఒకే ఒక పేరు వినిపించింది. ఆ పేరు అదానీ. దేశవ్యాప్తంగా ఈ పేరే వినిపించింది. ఎక్కడ చూసినా అదానీ, అదానీ, అదానీ. ఆలత ఏ వ్యాపారంలోకైనా ప్రవేశిస్తారు. ఎప్పుడూ విఫలమవ్వరని ప్రజలు నాతో చెప్పారు. ప్రతి వ్యాపారంలోనూ ఆయన ఏ విధంగా విజయం సాధిస్తున్నారు? ఆయన ఎప్పుడూ ఎందుకు విఫలమవవ్వరు? ఏమిటా మాయాజాలం? ఏమిటి ఈ సంబంధం? జనాలు నన్ను అడిగారు’’ అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-02-07T17:59:29+05:30 IST