Telugu: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పరిస్థితి మరీ ఇంత దారుణమా?..

ABN , First Publish Date - 2023-02-22T22:23:27+05:30 IST

‘తెలుగు భాష’కు సంబంధించిన ఓ పాత పోస్ట్ సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టింది. ‘తెలుగులో మాట్లాడడం శిక్షార్హం’ అనేది ఈ పోస్ట్ సారాంశం. ఇంతకీ ఆ పోస్ట్ ఎప్పుడు పెట్టారు?.. సారాంశం ఏంటి? అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం...

Telugu: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పరిస్థితి మరీ ఇంత దారుణమా?..

ప్రపంచీకరణ.. మెరుగైన ఉపాధి-ఉద్యోగావకాశాలు.. ఇలా కారణాలు ఏమైనా అనేక మాతృభాషలు పూర్వవైభవాన్ని కోల్పోతున్నాయి. పాశ్చాత్య భాషల మోజులో అమ్మభాషలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. పెద్దగా పట్టించుకునేవారు లేక ఆదరణకు దూరమవుతున్నాయి. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రశంసలందుకున్న ‘తెలుగు’ (Telugu) భాష కూడా దాదాపు ఇదే స్థితిని ఎదుర్కొంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (International Mother Language Day) సందర్భంగా ‘తెలుగు భాష’కు సంబంధించిన ఓ పాత పోస్ట్ సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టింది. ‘తెలుగులో మాట్లాడడం శిక్షార్హం’ అనేది ఈ పోస్ట్ సారాంశం. ఇంతకీ ఆ పోస్ట్ ఎప్పుడు పెట్టారు?.. సారాంశం ఏంటి? అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం...

స్వాతి బెల్లం (Swathi Bellam) అనే ట్విట్టర్ యూజర్ గతేడాది జనవరి 10, 2022న తెలుగు భాష (Telugu language) ఎదుర్కొంటున్న దుస్థితిని తెలియజేస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘తెలుగు మాట్లాడడం శిక్షార్హం’’ అని ఓ స్కూల్‌లో వేలాడతీసి ఉన్న బోర్డును ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘‘ మాతృభాషలో మాట్లాడితే శిక్ష. మన రాష్ట్రం ఒక్క మతాన్నే కాదు.. తెలుగు భాషను కూడా కోల్పోతుందా?. దయనీయమైన స్థితిలో ఉన్న ఈ స్కూల్ మేనేజ్‌మెంట్ తొలుత ఇంగ్లిష్‌లో తెలుగు స్పెల్లింగ్‌ను నేర్చుకోవాలి’’ అని చురకంటించారు. జనవరి 10, 2022న పెట్టిన ఈ పోస్టుపై చాలామంది నెటిజన్లు స్పందించారు. చాలామందికి తెలుగుకి కరెక్ట్ స్పెల్లింగ్ రాదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా ఈ స్కూల్ ఎక్కడ.. ఏపీనా.. తెలంగాణానా అని చాలామంది అడిగారు. కానీ ఈ కామెంట్లకు పోస్ట్ పెట్టిన స్వాతి బెల్లం నుంచి సమాధానమైతే రాలేదు. కానీ గతేడాది పెట్టిన పోస్టే అయినప్పటికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మరోసారి వైరల్ అయ్యింది.

అమ్మభాషకు తెలుగుకు తెలుగుగడ్డపైనే ఎదురవుతున్న దుస్థితిని ఈ పోస్ట్ చెప్పకనే చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీష్ లేదా ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. ఇతర భాషల్లో నైపుణ్యాన్ని ఎవరూకాదనడం లేదు. కానీ తెలుగు భాషలో మాట్లాడడం ఏవిధంగా శిక్షార్హం అవుతుంది?. తెలుగు భాషలో మాట్లాడడం అంత పెద్ద నేరమా?. అందునా ఓ స్కూల్‌లో ఇలాంటి బోర్డులేంటి? అనే ప్రశ్నలను తెలుగుభాషా మేధావులు లేవనెత్తుతున్నారు. ఇలాంటి చర్యలతో మన భాషను మనమే చంపుకున్నట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు. తెలుగు అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేదంటే తెలుగు కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని గుర్తుచేస్తున్నారు. కాగా ఇలాంటి సూచనలు, సలహాలు తెలుగు భాష అభ్యున్నతికి ఏవిధంగా దోహదపడతాయో వేచిచూడాలి.

Updated Date - 2023-02-22T22:23:32+05:30 IST