Viral News: కారు తాళం ఎంత పని చేసిందో.. ఆ చిన్న 'కీ' వల్ల ఓ యువతికి జరిగిన ప్రమాదం చూసి వైద్యులే హడలెత్తిపోయారు..!
ABN , First Publish Date - 2023-01-31T13:26:46+05:30 IST
మనలో చాలా మందికి వాహనాలు, ఇళ్ల తాళాలను గాల్లో ఎగిరేసి క్యాచులు పట్టే అలవాటు ఉండే ఉంటుంది.
Viral News: మనలో చాలా మందికి వాహనాలు, ఇళ్ల తాళాలను గాల్లో ఎగిరేసి క్యాచులు పట్టే అలవాటు ఉండే ఉంటుంది. అలా కాకపోయిన పనిమీద బయటకు వెళ్లే హడావుడిలో వాహనాల తాళాలు ఇంట్లోనే మరిచిపోయి కిందకు వచ్చేసిన తర్వాత ఇంట్లో వారిని వాటిని కింద విసిరేయమని, క్యాచులు పట్టడం కూడా చేస్తుంటాం. కానీ, ఇలాంటి పనులు ఎంత డేంజరో తాజాగా కెనడాలో (Canada) ఓ యువతికి జరిగిన ప్రమాదం చూస్తే అర్థం అవుతుంది. ఈ ప్రమాదం గురించి తెలిస్తే మీరు జన్మలో ఇలాంటి పని చేయరు అంటే నమ్మండి. 24 ఏళ్ల యువతికి ఒక చిన్న కీ వల్ల జరిగిన ప్రమాదం ఆమెకు చికిత్స చేసిన వైద్యులనే హడలెత్తించింది. అసలు ఒక చిన్న తాళం కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏంటని? ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

అసలేం జరిగిందంటే.. రెనీ లారివియర్ (24) అనే యువతి తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో కారు తాళం (Car Key) తన గదిలోనే మరిచిపోయి కిందకు వచ్చేసింది. దాంతో ఇంట్లోని కుటుంబ సభ్యులకు కీని కిందకు విసరమని చెప్పింది. అలా వారు కారు తాళాన్ని కిందకు విసిరిన సమయంలో రెనీ దాన్ని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించింది. అంతే.. ఆ కీ కాస్త నేరుగా వచ్చి ఆమె ముఖంపై గుచ్చుకుంది. తాళానికి ఉండే మెటల్ భాగం మొత్తం ఆమె చెంపలోపలికి గుచ్చుకుపోయింది. ఆమె స్నేహితులు ఆ కీని బయటకు లాగేందుకు ఎంత ప్రయత్నించిన రాకపోగా రక్తస్రావం మొదలైంది. ఆ నొప్పిని తట్టుకోలేక రెనీ కూడా విలవిలలాడిపోయింది. దాంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు మొదట ఎక్స్-రే తీశారు. ఆ ఎక్స్-రేలో కీ అనేది ఆమె కంటి కింద చెంపలోకి ఒక అంగుళంన్నర లోతు వరకు దిగిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత వైద్యులు ఒక చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించారు. అప్పటి వరకు తాను ఆ నొప్పితో నరకం చూశానని రెనీ చెప్పుకొచ్చింది.