గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-23T14:08:00+05:30 IST

గతేడాది సెప్టెంబర్‌లో తిరువనంతపురంకు చెందిన ఆటో డ్రైవ అనూప్ (Anoop M) పేరు దేశవ్యాప్తంగా మార్మొగిపోయిన విషయం తెలిసిందే.

గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది సెప్టెంబర్‌లో తిరువనంతపురంకు చెందిన ఆటో డ్రైవ అనూప్ (Anoop M) పేరు దేశవ్యాప్తంగా మార్మొగిపోయిన విషయం తెలిసిందే. ఓనమ్ బంపర్ లాటరీలో అనూప్(Onam bumper lottery winner) ఏకంగా రూ.25కోట్లు గెలవడంతో (Rs 25 crore winner) మనోడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారడంతో పాటు సెలబ్రిటీ అయిపోయాడు. మీడియా వాళ్లు ఆయన ఇంటి ముందు క్యూకట్టారు. అప్పటివరకు కనీసం అతని ఊరిలో కూడా సరిగ్గా తెలియని అనూప్.. లాటరీలో విజేతగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత కోట్లు గెలుచుకున్నానన్న ఆనందం లేదంటూ మరోసారి వార్తల్లో నిలిచాడు. అంత డబ్బు ఎందుకు గెలుచుకున్నానా? అని వాపోయాడు కూడా. దానికి కారణం మీడియా అతి ప్రచారం. ఇంకేముంది చూట్టుపక్కల వారందరూ అనూప్ వద్ద ఆర్థిక సాయం కోసం క్యూకట్టారు. దాంతో ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇదంతా ఐదు నెలల కిందటి మాట. ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటి? అసలు అనూప్ ఏం చేస్తున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అనూప్ లైఫ్‌స్టైలే పూర్తిగా మారిపోయిన్నట్లు తెలుస్తుంది. ఆటో డ్రైవర్ నుంచి మనోడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాటరీ బిజినెస్ ఏజెంట్‌గా మారిపోయాడు. అతనికి లాటరీ నిర్వాహకులు కీలక బాధ్యతలే అప్పగించారు. లాటరీ టికెట్ల సీరియల్ నంబర్లను ఎంపిక చేసి, వాటిని సంబంధిత క్లయింట్స్ ద్వారా విక్రయించడం మనోడి డ్యూటీ. అంతేనా.. సొంతంగా 'ఏం ఏ లక్కీ సెంటర్' పేరుతో ఓ రిటైల్ లాటరీ స్టోర్‌ను కూడా తెరిచాడు. ఇక లాటరీ లాటరీ గెలుచినట్టు తెలియడంతో.. బంధువులు సహా చుట్టు పక్కల వాళ్లు ఇతర ప్రజలూ అతడి ఇంటికి క్యూ కట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ అతడు ఆ తర్వాత ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఏకంగా ఆ చోటునే మార్చేశాడు. ఓ కొత్త ప్రాంతంలో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేశాడు. కొత్త ఇంట్లో ప్రస్తుతం లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే, ఇప్పటికీ సాయం కోసం వస్తున్న ఉత్తరాలు మాత్రం ఆగడం లేదట. పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే కుప్పలుతెప్పలుగా ఉత్తరాలు వచ్చేవో ఇప్పుడు కూడా అదే పంత కొనసాగుతుందని చెబుతున్నాడు. ఇప్పుడు ఏకంగా తన షాపు వద్దకే వచ్చి సాయం అడుగుతున్నారట. నెలలు గడుస్తున్న ఇప్పుడు కూడా ఇలాగే చాలా మంది ప్రతిరోజూ తన వద్ద సాయం కోసం వస్తున్నట్లు తెలిపాడు.

ఇది కూడా చదవండి: అగ్రరాజ్యం అమెరికాలో కలకలం.. 'జాంబీలు'గా మార్చేస్తున్న కొత్త డ్రగ్‌..!

ఇదిలాఉంటే.. కేరళ ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న ఈ లాటరీ బిజినెస్ ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిరోజు ఓ లక్షాధికారి తయారవుతున్నట్లు అనూప్ చెబుతున్నాడు. కేరళ లాటరీ విభాగం ఏకంగా 1లక్షకు పైగా రిజిస్టర్డ్ ఏజెంట్లను కలిగి ఉందట. వారి కింద సబ్-ఏజెంట్స్, ఇతర సిబ్బంది ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాపారం ద్వారా లక్షలాదిగా ఉపాధి పొందుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ బిజినెస్ ద్వారా రాష్ట్రానికి వార్షికంగా భారీ ఆదాయమే సమకూరుతుందట. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ రూ.7145.22కోట్లుగా నమోదైంది. ఇక రిజిస్టర్డ్ ఏజెంట్లకు కూడా కమీషన్ల రూపంలో బాగానే వస్తుందట. ప్రస్తుతానికి అనూప్ జీవితం ఈ ఏజెంట్ రూపంలో సాఫీగానే సాగుతుంది. సొంత లాటరీ షాపులో టికెట్లు విక్రయిస్తూ, అటు ఏజెంట్‌గా పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: ఓ డబ్బాలో పామును పట్టుకుని ఆస్పత్రికి తీసుకొచ్చాడో యువకుడు.. అసలు విషయం తెలిసి అవాక్కైన డాక్టర్లు..

Updated Date - 2023-02-23T14:29:26+05:30 IST