Budget: గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయిన హైదరాబాద్ ‘ZERO’ ఫ్లెక్సీ..

ABN , First Publish Date - 2023-02-02T20:13:53+05:30 IST

తెలంగాణలో ఫ్లెక్సీల (Flexie) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోదీపై (PM Modi) బీఆర్ఎస్ (BRS).. సీఎం కేసీఆర్‌‌పై (CM KCR) బీజేపీ...

Budget: గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయిన హైదరాబాద్ ‘ZERO’ ఫ్లెక్సీ..

హైదరాబాద్ : తెలంగాణలో ఫ్లెక్సీల (Flexie) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోదీపై (PM Modi) బీఆర్ఎస్ (BRS).. సీఎం కేసీఆర్‌‌పై (CM KCR) బీజేపీ (BJP) డిజిటల్ బోర్డులు (Digital Boards) పార్టీ ఆఫీసుల ముందు పెట్టి గట్టిగానే హడావుడి చేశారు. కేసీఆర్‌‌ను అధికారంలో నుంచి దించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందనే విషయాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లతో సహా కౌంట్‌డౌన్ డిజిటల్ బోర్డు పెట్టారు. అయితే అనుమతి లేకపోవడంతో ఈ బోర్డులను జీహెచ్ఎంసీ (GHMC) తొలగించింది. ఆ తర్వాత అటు బీజేపీ కానీ.. ఇటు బీఆర్ఎస్ కానీ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో ‘జీరో’ పేరుతో (Zero Flexie) ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంతకీ ఈ ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది..? బీజేపీపై ఈ ఫ్లెక్సీని బీఆర్ఎస్ అస్త్రంలా ప్రయోగిస్తోందా..? అనే అంశంపై ప్రత్యేక కథనం.

Nirmala-Sitharaman.jpg

నలుగురిలో నారాయణలా..!

కేంద్ర బడ్జెట్‌లో (Union Budge-2023) తెలుగు రాష్ట్రాలకు (Telugu States) నిధులివ్వలేదు.. గ్యారెంటీ కూడా లేదు.. ఇక ప్రాజెక్టుల (Projects) ఊసు అయితే అస్సలే లేదు.. ఇదీ పరిస్థితి. వీటన్నింటికీ మించి ఏ గ్రాంటు కిందా కేటాయింపులు ఇవ్వలేదు. నలుగురిలో నారాయణ అన్న చందంగా రెండు, మూడు రాష్ట్రాలతో కలిపి కొన్ని అంశాల్లో డబ్బులిస్తామని చెప్పడానికే కేంద్ర బడ్జెట్‌ పరిమితమైందని తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలుగు రాష్ట్రాలకు ఒక్క ప్రకటన అయినా చేస్తారులే అని జనాలు టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు కానీ చివరికి నిరాశే మిగిలింది.

Zero....jpg

ఇదీ ఫ్లెక్సీ కథ..

కేంద్ర బడ్జెట్‌-2023లో తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావించింది. ఇందుకోసం రొటీన్‌గా కాకుండా వినూత్నంగా ప్లాన్ చేసింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది ‘జీరో’ అని ఫ్లెక్సీని హైదరాబాద్‌లో (Hyderabad) ఏర్పాటు చేసి తమ అసంతృప్తిని తెలియజేసింది బీఆర్ఎస్. ‘ZERO’ అనే పదాన్ని ఎరుపు రంగులో ప్రింట్ చేయించి.. ‘O’ అనే అక్షరంలో ప్రధాని మోదీ (Narendra Modi) తలదించుకున్నట్లుగా ఫొటో ఉంది. ఈ ఒక్క ఫ్లెక్సీతో తెలంగాణపై కేంద్రం ఎలా వ్యవహరిస్తోందో జనాలకు చెప్పడానికి ప్రయత్నించింది. ఈ ఫ్లెక్సీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఫ్లెక్సీని బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లుగా ఎక్కడా ఆధారాలు కూడా లేవని.. అసలు పార్టీకి సంబంధమే లేదని అభిమానులు, కార్యకర్తలు నెట్టింట్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు బీజేపీ కార్యకర్తలు కూడా కౌంటర్‌గా కామెంట్స్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారు....? బీఆర్ఎస్‌కు తప్ప మరొకరికి ఆ అవసరమేంటి..? అని కూడా బీజేపీ ఫ్యాన్స్ (BJP Fans) నిలదీస్తున్నారు. మరోవైపు.. నిద్రలేచింది మొదలుకుని ఆహా.. ఓహో అని మీడియా ముందుకు డప్పుకొట్టుకునే బీజేపీ ఎంపీలు (TS BJP MPs) ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు.

Zero-01.jpg

మొత్తానికి చూస్తే.. తెలంగాణలో పెద్దగా కనిపించని కౌంటర్ ఫ్లెక్సీలు, డిజిటల్ బోర్డులు ఇప్పుడు ‘ZERO’తో మళ్లీ ఆ పరిస్థితి మొదలైందన్న మాట. ఇప్పుడు ఒక్క ‘ZERO’ ఫ్లెక్సీ తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎంపీలు, ప్రముఖులు స్పందించి మోదీ సర్కార్ తీరును విమర్శించారు. ఈ ఫ్లెక్సీపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు..? కౌంటర్లు ఎలా ఉండబోతున్నాయి..? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-02-02T20:38:14+05:30 IST