Rahul disqualificaion: వయనాడ్‌లో కాంగ్రెస్ వ్యూహమేంటి?.. ఇదేనా..!

ABN , First Publish Date - 2023-03-26T17:23:58+05:30 IST

రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు పడడంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి ఉపఎన్నికపై ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నాయి.

Rahul disqualificaion: వయనాడ్‌లో కాంగ్రెస్ వ్యూహమేంటి?.. ఇదేనా..!

రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు (Rahul disqualification) పడడంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి (Wayanad Parliament constituency) ఉపఎన్నికపై ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ (Congress Party) ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలపై (Mass Resignations) యోచిస్తుండగా.. మరోవైపు ఉపఎన్నిక అనివార్యమైతే వయనాడ్‌(Wayanad)ను ఎలా కాపాడుకోవాలనే అంశంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ వారంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) తోపాటే.. వయనాడ్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దేవికులం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే ఎ.రాజాపై (MLA Raja) అనర్హత వేటు పడడంతో ఆ స్థానానికి.. జోస్.కె.మణి (Jos K Mani) రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన కోట్టాయం అసెంబ్లీ సెగ్మెంట్‌‌కు (Kottayam Assembly Segment) ఉపఎన్నికలు అనివార్యంగా మారాయి. వాటికి కూడా కర్ణాటక ఎన్నికల(Karnataka Elections)తోపాటే.. నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్‌దే పైచేయి..!

ముందు నుంచి వయనాడ్‌పై కాంగ్రెస్‌కు (Wayanad Congress) మంచి పట్టుంది. 2009, 2014లో కాంగ్రెస్ తరఫున ఎం.ఐ.షానవాజ్ ఈ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే.. ఆయన తన ప్రత్యర్థిపై (CPM) 20వేల దాకా మెజారిటీకే పరిమితమయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనూహ్యంగా అమేఠీతోపాటు.. వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేఠీ(Amethi)లో ఓడినా.. వయనాడ్‌లో భారీ మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికలో రాహుల్‌ 7.06 లక్షల ఓట్లను.. ఆయన సమీప ప్రత్యర్థి, సీపీఎం నేత పీపీ సునీర్ 2.74 లక్షలను సాధించారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యారు. ఇప్పుడు అధిష్ఠానం ఈ స్థానం నుంచి ఎవరిని నిలబెట్టినా.. విజయం కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

Untitled-2.jpg

సీపీఎం మద్దతిస్తుందా..?

వయనాడ్‌కు ఉప ఎన్నిక జరిగితే.. సీపీఎం (CPM) తమకు మద్దతిచ్చే అవకాశాలున్నాయని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) చీఫ్ కె.సుధాకరన్ (K.Sudhakaran) ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. దీన్ని సీపీఎం నేతలు ఖండించడమే కాకుండా.. వ్యంగ్యాస్త్రాలను సంధించారు. సీపీఎం కన్నూర్ జిల్లా (Kannur District) కార్యదర్శి ఎంవీ జయరాజన్ (M.V.Jayarajan).. రాహుల్ అనర్హతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. ‘‘ఓవైపు రాహుల్‌పై అనర్హత వేటు పడితే.. మరోవైపు ఉపఎన్నిక గురించి ఆలోచించడం కాంగ్రెస్‌కే చెల్లుతుంది. ఢిల్లీలో మావాళ్లు రాహుల్‌కు మద్దతుగా ధర్నా చేస్తే.. పోలీసులు సీపీఎం ఎంపీని అరెస్టు చేశారు. దాన్ని చూసి, కాంగ్రెస్ ఎంపీలు పారిపోయారు’’ అని ఫేస్‌బుక్‌లో విమర్శలు గుప్పించారు. భారత్‌లో లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కాంగ్రెస్‌ది వెన్నెముక లేని వైఖరి అని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్‌పై చర్యను సీపీఎం జాతీయ నేతలు ఖండించి, సానుభూతిని, సంఘీభావాన్ని ప్రకటించినా.. రాష్ట్ర పార్టీ నేతల తీరు తామూ పోటీచేస్తాం అనేలా ఉంది. ఈ మేరకు సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్(M.V.Govindan) శనివారం ఓ ప్రకటన చేశారు. ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని, అయితే.. ఎన్నికలు అనివార్యమవుతాయని తాను భావించడం లేదని ఆయ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతిచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.

మాస్ ఓటర్ల మద్దతుతో..

గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే వయనాడ్‌లో ఒకప్పుడు మాస్ ఓటర్లంతా(Mass Voters) వామపక్షాల(Left Parties)కు మద్దతిచ్చారు. రెండు దశాబ్దాలుగా ఆ సంప్రదాయం మారింది. రాహుల్ వయనాడ్ ఎంపీ అయ్యాక.. వారి నుంచి మరింత మద్దతు కూడగట్టుకున్నారు. వయనాడ్‌లో 93.15% ఓటర్లు గ్రామీణ ప్రాంతాల వారున్నారు. నానమ్మ ఇందిరాగాంధీ పోలికలు ఉండే ప్రియాంక రంగంలోకి దిగితే.. కాంగ్రెస్‌కు మాస్ ఓటర్ల మద్దతు మరింత పెరుగుతుందని కేరళ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 6.85% పట్టణ ఓటర్లు కూడా సానుభూతి ఓట్లు వేసే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కడం కూడా కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

వయనాడ్ నియోజకవర్గ ఓటర్ల వివరాలు(2019 జాబితా ప్రకారం)

మొత్తం ఓటర్లు: 12,49,420

పురుషులు: 6,14,822

మహిళలు: 6,34,598.

Updated Date - 2023-03-26T17:25:52+05:30 IST