Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-09-04T21:08:34+05:30 IST

‘రాజకీయాస్త్రానికి కాదేదీ అనర్హం’ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడమే అనేలా అధికార, విపక్షాలు తయారయ్యాయి. జనాల మధ్య చిచ్చుపెడుతున్నామా? సమాజానికి కీడు తలపెడుతున్నామా?, అనర్థాలకు ఆజ్యం పోస్తున్నామా?.. అనే ఇంగితం లేకుండా సున్నిత అంశాలను సైతం అస్త్రశస్త్రాలుగా వాడుకుంటున్నాయి రాజకీయ పక్షాలు. ఈ ఒరవడి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాకపోయినప్పటికీ రాజకీయ నాయకుల వైఖరి ఆందోళనలను పెంచుతోంది.

Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

‘రాజకీయాస్త్రానికి కాదేదీ అనర్హం’ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడమే అనేలా అధికార, విపక్షాలు తయారయ్యాయి. జనాల మధ్య చిచ్చుపెడుతున్నామా? సమాజానికి కీడు తలపెడుతున్నామా?, అనర్థాలకు ఆజ్యం పోస్తున్నామా?.. అనే ఇంగితం లేకుండా సున్నిత అంశాలను సైతం అస్త్రశస్త్రాలుగా వాడుకుంటున్నాయి రాజకీయ పక్షాలు. ఈ ఒరవడి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాకపోయినప్పటికీ రాజకీయ నాయకుల వైఖరి ఆందోళనలను పెంచుతోంది. ‘‘ సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా లాంటిదని.. దోమలను, వైరస్‌ను నిర్మూలించినట్లే దానినీ సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది’’ అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, ఆ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు, కౌంటర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిందే సున్నిత వ్యాఖ్యలంటే ఇతర రాజకీయ పక్షాలు ఇస్తున్న కౌంటర్లు మతం పేరిట రాజకీయ చిచ్చురేపుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు...

శనివారం రాత్రి చెన్నైలోని కామరాజర్‌ అరంగంలో తమిళ అభ్యుదయ రచయితల సంఘం, ద్రవిడ కళగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘సనాతన ధర్మ నిర్మూలనా మహానాడు’లో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడారు. ‘‘సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా లాంటిదని.. దోమలను, వైరస్‌ను నిర్మూలించినట్లే దానినీ సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కొన్నింటిని మనం పూర్తిగా నిర్మూలించాల్సిందే. దోమలు, డెంగీ, మలేరియా, కరోనాను మనం వ్యతిరేకించకూడదు. వాటిని సమూలంగా నిర్మూలించాలి. ఆ కోవలోనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కంటే నిర్మూలించడమే మన ప్రధాన కర్తవ్యం. సనాతనం అనే పదమే సంస్కృతం నుంచి వచ్చింది. అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. సనాతనం అంటే స్థిరమైనది లేదా మార్చడానికి వీలులేనిది అని అర్థం. అన్నింటిలోనూ మార్పు ఉంటుంది. ఏవీ స్థిరమైనవి కావు’’ అని ఉదయనిధి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.


Untitled-2.jpg

మండిపడిన హిందూ సంస్థలు

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా పలు హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్‌పై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ, హిందూమున్నాని తదితర సంస్థలు డిమాండ్‌ చేశాయి. తమిళనాడులో భారత రాజ్యాంగం అమలవుతోందా అని వీహెచ్‌పీ అగ్ర నేత అలోక్‌కుమార్‌ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారే నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. కైస్తవం లేదా ఇస్లాం మతం రాకముందే సనాతన ధర్మం అనే పదం ఉందని, సనాతన ధర్మం అంటే శాశ్వతమైనదని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. క్రైస్తవ మిషనరీల ఆలోచనలనే ఉదయనిధి, స్టాలిన్‌ ప్రతిధ్వనింపజేస్తున్నారని ధ్వజమెత్తారు.

సున్నిత అంశాలూ రాజకీయమేనా?

చిన్న అవకాశం దొరికినా పరస్పరం దుమ్మెత్తి పోసుకునే రాజకీయపక్షాలు సున్నిత అంశాలకు కూడా ఏమాత్రం మినహాయింపు ఇవ్వడంలేదనడానికి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. కానీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఒక మతాన్ని నిర్మూలించాలనడంపై అటు రాజకీయంగానూ ఇటు హిందూమతం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయాస్త్రంగా మారుతున్న తీరుపై కూడా కలవరం వ్యక్తమవుతోంది. సున్నితమైన అంశాలను రాజకీయ అస్త్రాలుగా మార్చుకునే విషయంలో రాజకీయ పార్టీలు, నేతలు దూరంగా పాటించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విషయాన్ని మరింత శ్రద్ధగా గ్రహించాల్సిన అవసరం ఉందని సమాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. లేదంటే అనర్థాలకు సమాజంలో చిచ్చుపెడతాయని చెబుతున్నాయి. అధికారమే పరమావధిగా భావించే రాజకీయ పార్టీలు ఈ సూచనలను ఎంతవరకు చెవిన పెడతాయో వేచిచూడాలి.

Updated Date - 2023-09-04T21:15:11+05:30 IST