Amara Raja: పాపం ఏపీ.. ఇక్కడ విషయం జగన్ గుడ్‌బై లేదా కేటీఆర్ షేక్‌హ్యాండ్ ఇవ్వడమో కాదు..

ABN , First Publish Date - 2023-05-06T16:18:21+05:30 IST

పెట్టుబడుల కోసం దేశాలే పోటీపడుతున్న రోజులు ఇవి! మన దేశంలోని రాష్ట్రాలు ‘రండి.. రండి’ అంటూ ఎర్ర తివాచీ పరిచి మరీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు..

Amara Raja: పాపం ఏపీ.. ఇక్కడ విషయం జగన్ గుడ్‌బై లేదా కేటీఆర్ షేక్‌హ్యాండ్ ఇవ్వడమో కాదు..

పెట్టుబడుల కోసం దేశాలే పోటీపడుతున్న రోజులు ఇవి! మన దేశంలోని రాష్ట్రాలు ‘రండి.. రండి’ అంటూ ఎర్ర తివాచీ పరిచి మరీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు.. పరిశ్రమలతో ఉపాధి, ఆదాయం, అభివృద్ధి! అందుకే.. ఇంత పోటీ! కానీ.. దీనికి జగన్‌ సర్కారు మినహాయింపు! పెట్టుబడిదారులపైనా కక్ష సాధింపు! గిట్టని వాళ్లపై వెంటాడి వేధింపు! పొరుగు రాష్ట్రాలు దండం పెట్టి మరీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తే.. ఏపీలో మాత్రం ‘దండం పెట్టి చెబుతున్నాం. మీరు వెళ్లిపోండి’ అనేంత బరితెగింపు! పెట్టుబడులపై జగన్‌ దెబ్బకు జనం భవిష్యత్తే బలి అవుతోంది!

FvbnftRWAAARp7s.jpg

ఈ పరిస్థితుల్లోనే.. ఆంధ్రప్రదేశ్‌కు శాపం.. తెలంగాణకు వరమైంది. ఏపీలో రాజకీయ వేధింపుల పర్వం తెలంగాణలో లిథియం-అయాన్‌ బ్యాటరీల తయారీలో పెద్ద ముందడుగుకు బీజం వేసింది. బ్యాటరీల తయారీలో ఆసియాలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ తన కొత్త లిథియం-ఐయాన్‌ బ్యాటరీల తయారీ యూనిట్‌ను 37 ఏళ్లుగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో స్థాపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. శనివారం (06-05-2023) నాడు అమరరాజా గిగా కారిడార్‌కు తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. తెలంగాణలోనే మొదటిసారిగా ఏర్పాటవుతున్న గిగా కంపెనీ అమరరాజా గిగా కారిడార్‌కు దివిటిపల్లి వద్ద మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

FvbnftNWAAAHhxS.jpg

రాజధాని హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో దేశంలోనే అతిపెద్ద యూనిట్‌ను అమరరాజా కంపెనీ ఏర్పాటు చేయనుండటం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా బ్యాటరీస్‌ అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం మేరకు పదేళ్లలో మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడతారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద దేశీయ పెట్టుబడి ఇదే. దీంతో 4,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తొలిదశలో 1500-2000 కోట్లు పెట్టుబడి పెడతారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయి.

Fvbz4RKWwAEMKSL.jpg

అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన అమరరాజా సంస్థ సొంత రాష్ట్రంపై మక్కువతో చిత్తూరు జిల్లాలో అతి భారీ పరిశ్రమ పెట్టి.. వేలాది మంది స్థానికులకు ఉపాధి కల్పించింది. విస్తరణకు ఏపీలో పరిస్థితులు అనుకూలించక పొరుగు రాష్ట్రాన్ని ఎంచుకుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన ‘అమర రాజా’ ప్లాంటును మూసివేయించడమే లక్ష్యంగా జగన్‌ సర్కారు చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు! కియా నుంచి అమరరాజా వరకు రాష్ట్రంలోనే ఉండాల్సిన విస్తరణ యూనిట్లు మాయమైపోయాయి. కొత్త పెట్టుబడులు పరారయ్యాయి. ఇది... జగన్‌ సర్కారు దెబ్బే అని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

‘అమరరాజా ఒక కాలుష్య కారక కంపెనీ. దండం పెట్టి మేమే పొమ్మంటున్నాం’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెలవిచ్చిన సంగతి తెలియంది కాదు. కానీ.. అది పారిశ్రామిక కాలుష్యం కాదని, సర్కారు పెద్దల రాజకీయ కాలుష్యమని పెట్టుబడిదారులే చెబుతున్నారు. గత ఏడాది అమరరాజాను ప్రభుత్వం వెంటాడి వేధించిన విధానంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలివి!

52850005-2480-4c52-98b6-8022a108c889.jpg

20f45ba2-dda9-4f03-8465-f0d99b7ed8c0.jpg3b203e64-42ca-4d0f-aca3-0ba4f71f9b58.jpg

జగన్‌ సర్కారు రాగానే పారిశ్రామిక దృశ్యం మొత్తం మారిపోయింది. ‘రివర్స్‌’ విధానాలు మొదలుపెట్టడంతో పెట్టుబడులూ తిరుగుముఖం పట్టాయి. ఏపీకి వచ్చేందుకు సిద్ధమై.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన యూనిట్‌ల పెట్టుబడుల విలువ 1,73,167 కోట్ల రూపాయలు! ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నంబర్‌ 1... పెట్టుబడిదారులకు మేం ఫ్రెండ్లీ’ అని జగన్‌ సర్కారు చెబుతున్నా పారిశ్రామికవేత్తలు ఎందుకు పారిపోతున్నారన్నదే ప్రశ్న! మౌలిక వసతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు, అనవసరమైన వేధింపుల్లేకుండా సహకారం, ప్రశాంత వాతావరణం.. పెట్టుబడిదారులు కోరుకునేవి ఇవే! మరి ఏపీలో ఏం జరుగుతోంది?

ఒక్క అమరరాజానే కాదు ఏపీకి ముఖం చాటేసిన కంపెనీలు ‘జగనన్న పాలన’లో చాలానే ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇంతలా దూరం చేస్తున్న వైసీపీ మళ్లీ ‘జగనన్న.. నువ్వే మా భవిష్యతు’ అని ఇంటింటికీ తిరిగి తలుపుల మీద స్టిక్కర్లు అంటిస్తుండటం కొసమెరుపు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో 727 కోట్లతో బ్యాటరీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అమెరికా సంస్థ ట్రైటాన్‌ ముందుకొచ్చింది. ఎన్నికల తర్వాత సీన్‌ మారిపోవడంతో ఆ సంస్థ వెనక్కి తగ్గి... తెలంగాణకు వెళ్లిపోయింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో ఒకటి. విశాఖలో 450 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాల ప్రారంభానికి ఆసక్తి చూపింది. ఆ సంస్థకు భూమి కేటాయించాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ సంస్థ వెనక్కి తగ్గింది. యూఏఈ తర్వాత లులూ సంస్థ తన సొంత రాష్ట్రం కేరళలో భారీ మాల్‌ నిర్మించింది. ఆ తర్వాత.. ఏపీలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. విశాఖలో రూ.2200 కోట్లతో కన్వెన్షన్‌, షాపింగ్‌మాల్‌, స్టార్‌ హోటల్స్‌ నిర్మించాలని ఆ సంస్థ ప్రణాళికలు వేసింది.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక లులూ గ్రూప్‌నకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంది. ‘ఇంకెప్పుడూ ఏపీ వైపు కూడా చూడం’ అని లులూ సంస్థ బహిరంగంగానే ప్రకటించింది. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతలా తిరోగమనం బాటలో పయనిస్తుందో చెప్పడానికి కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలివి. అభివృద్ధి అనే మాటకు ఆమడ దూరంలో ఉన్నప్పటికీ ‘నవరత్నాలు’ తమను గెలిపిస్తాయనే ధీమాలో వైసీపీ ఉండటం గమనార్హం. కానీ.. జగన్ సర్కార్ విధానాల వల్ల ఉపాధి అవకాశాలు దూరమై.. ఏపీ యువత భవిష్యత్ నాశనమవుతోందని.. ఇప్పటికీ ఏ హైదరాబాదో, బెంగళూరో, చెన్నైకో వెళ్లాల్సిన పరిస్థితి ఉందని యువత తల్లిదండ్రులు వాపోతున్నారు.

Updated Date - 2023-05-06T16:31:43+05:30 IST