Sharmila YSRTP: వదిలిన బాణమే జగనన్నకు ఎదురొస్తే.. షర్మిల పార్టీ విలీనం వార్తలతో వైసీపీలో వణుకెందుకంటే..

ABN , First Publish Date - 2023-06-20T18:38:48+05:30 IST

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందా..? వైఎస్ షర్మిల, కాంగ్రెస్ మైత్రీ బంధంపై.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం వార్తలపై ప్రత్యేక కథనం.

Sharmila YSRTP: వదిలిన బాణమే జగనన్నకు ఎదురొస్తే.. షర్మిల పార్టీ విలీనం వార్తలతో వైసీపీలో వణుకెందుకంటే..

వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తుది శ్వాస వరకూ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు. ఏపీ సీఎం జగన్ జైలులో ఉన్న సమయంలో అన్నకు అండగా నిలిచి.. ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేసిన ‘జగనన్న వదిలిన బాణం’. కాల క్రమేణా పరిస్థితులు మారాయి. రాజకీయ పరిణామాలు మారాయి. అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్సార్‌టీపీని స్థాపించిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆశా కిరణంలా కనిపిస్తోందా..? గతంలో జగనన్న వదిలిన ఇదే బాణాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడు జగన్‌ పైనే అస్త్రంగా సంధించబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కాకపోయినా ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో అయినా అన్నాచెల్లెలి సవాల్ తప్పదా..? వైఎస్ రాజశేఖర రెడ్డి మాస్ ఇమేజ్‌తో రెండుసార్లు అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయన కుమార్తె షర్మిలను ముందు నిలిపి ఏపీలో భవిష్యత్ రాజకీయం చేయడం తథ్యమా..? కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందా..? వైఎస్ షర్మిల, కాంగ్రెస్ మైత్రీ బంధంపై.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం వార్తలపై ప్రత్యేక కథనం.

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్నారని దాదాపుగా తేలిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం అక్కడి కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపడం మొదలుకుని రాహుల్ గాంధీకి ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం వరకూ.. ఈ పరిణామాలు షర్మిల రాజకీయంగా ఎటు వైపునకు అడుగులు వేస్తున్నారోననే అనుమానాలకు తావిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలతో మైత్రీ బంధానికి ఉవ్విళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిరాదరణే అందుకు కారణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పట్టుమని పది స్థానాలు గెలిచే పరిస్థితి ఉందని కూడా కచ్చితంగా చెప్పలేని దురవస్థలో ఏపీలో హస్తం పార్టీ ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల వైపు కాంగ్రెస్ పార్టీ ఆశగా ఎదురుచూస్తోందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగే వైఎస్ షర్మిల రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికర చర్చకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేయనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వైఎస్సార్‌టీపీ విలీనానికి తేదీ కూడా ఖరారైందని, జులై 8న (వైఎస్సాఆర్ జయంతి) ఇడుపులపాయకు సోనియా, రాహుల్ గాంధీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అదే రోజు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్ సమాధి సాక్షిగా షర్మిల విలీనం చేయనున్నారనే ప్రచారం నెట్టింట ఊపందుకుంది. ఒకవేళ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ఎలాంటి పాత్ర పోషించనున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కర్ణాటక ఎన్నికలు వెలువడిన అనంతరం.. మే 21, 2023న ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’లో షర్మిల-కాంగ్రెస్ మైత్రీ బంధం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ‘కాంగ్రెస్ కదనోత్సాహం.. జగనన్నపైకి షర్మిల బాణం!’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కొత్తపలుకులో ఆర్కే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

షర్మిల-కాంగ్రెస్ మైత్రి గురించి ఆర్కే ‘కొత్త పలుకు’ కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-06-21T11:36:54+05:30 IST