Verdict On CBN Cases : చంద్రబాబు పిటిషన్లపై విచారణలో ఏం జరిగింది.. తీర్పు ఎప్పుడు.. లాజిక్ పట్టిన సాల్వే..!?

ABN , First Publish Date - 2023-09-19T13:06:08+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులకు (NCBN Cases) సంబంధించి విచారణ ఇవాళ జరుగుతోంది. అటు ఏసీబీ.. ఇటు హైకోర్టుల్లో విచారణ నడుస్తోంది. ఇక ఏపీ హైకోర్టులో హైబ్రిడ్ మోడ్‌లో బాబు కేసు విచారణ సాగుతోంది..

Verdict On CBN Cases : చంద్రబాబు పిటిషన్లపై విచారణలో ఏం జరిగింది.. తీర్పు ఎప్పుడు.. లాజిక్ పట్టిన సాల్వే..!?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసులకు (NCBN Cases) సంబంధించి విచారణ ఇవాళ జరుగుతోంది. అటు ఏసీబీ.. ఇటు హైకోర్టుల్లో విచారణ నడుస్తోంది. ఇక ఏపీ హైకోర్టులో హైబ్రిడ్ మోడ్‌లో బాబు కేసు విచారణ సాగుతోంది. రిమాండ్ రివ్యూ, క్వాష్ పిటిషన్లపై హైకోర్టు విచారిస్తోంది. ఆన్‌లైన్‌లో ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయవాది విచారణ జరుపుతున్నారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అది కాస్త ఆలస్యం అయ్యింది. చంద్రబాబు సుప్రీంకోర్టు లాయర్లు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు సాగుతున్నాయి.


Chandrababu.jpg

ఏసీబీ కోర్టులో ఇలా..!

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన 3 పిటిషన్లు విచారణకు వచ్చాయి. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై.. పిటిషన్‌పై టీడీపీ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టు నిర్ణయం వచ్చేవరకు కస్టడీ పిటిషన్‌పై ఎటువంటి ప్రక్రియ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించినది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లపై సీఐడీ ఇంతవరకూ ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. ఈ క్రమంలో ఆ పిటిషన్లను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పక్కన పెట్టారు. లంచ్ తరువాత హైకోర్టు నిర్ణయం మేరకు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

highcourt1.jpg

మళ్లీ వాయిదా..!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 21 కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. దీంతో మరికొన్ని పిటిషన్లు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

harish-Salve.jpg

రంగంలోకి దిగిన హరీష్!

ప్రస్తుతం క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అనుమతి తీసుకోలేదు. ప్రజాప్రతినిధుల అరెస్టుపై గత తీర్పులు అనేకం ఉన్నాయి. 2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు..? అని హరీష్ ప్రశ్నించారు. అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదు.. అది నమోదయ్యాకే అరెస్ట్ చేయాలన్న విషయాన్ని సాల్వే చెప్పుకొచ్చారు. చంద్రబాబు విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదని న్యాయమూర్తికి సాల్వే వివరించారు. చంద్రబాబు అరెస్ట్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేశారన్నారు. ఇదంతా Regime Revenge గా హరీష్ సాల్వే అభివర్ణించారు. అర్ణబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును ఆయన ఉదహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని పరిధి దాటి వాడిన సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సాల్వే పేర్కొన్నారు. ఇది కేవలం GST కేసన్న సాల్వే.. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు స్పష్టం చేశారు.

కాగా..ఇదివరకు జరిగిన విచారణలో కూడా చంద్రబాబు ఆరోగ్యం, భద్రతతో పాటు పలు విషయాలను సిద్ధార్థ లూథ్రా ఏసీబీ, హైకోర్టుల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆయన లేవనెత్తిన లాజిక్ ప్రశ్నలకు సీఐడీ తరఫు న్యాయవాదులు తడబడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు సాల్వే కూడా అంతకుమించి ప్రశ్నలు, లాజిక్‌లతో వాదనలు వినిపిస్తున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.

CBN-Siddarth.jpg

తీర్పు ఎప్పుడు..?

ఈ పిటిషన్లు అన్నింటిపైనా విచారణ దాదాపు వాయిదా పడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. తీర్పు అయితే ఇవాళ వచ్చే ఛాన్స్ లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్‌పై వాయిదా పడగా.. మధ్యాహ్నం పైన రిమాండ్ రివ్యూ, క్వాష్ పిటిషన్లపై కూడా విచారణను హైకోర్టు వాయిదా వేసే అవకాశముంది.

CID-Vs-ACB.jpg

Updated Date - 2023-09-19T13:11:05+05:30 IST