Nellore Politics : నెల్లూరు పెద్దారెడ్ల పంచాయితీ పీక్స్.. నిన్న రూరల్.. ఇవాళ ఉదయగిరి వైసీపీలో ముసలం.. ఈసారి ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2023-02-01T22:12:11+05:30 IST

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో (Nellore District) క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీకి (YSRCP) ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోందా..?

Nellore Politics : నెల్లూరు పెద్దారెడ్ల పంచాయితీ పీక్స్.. నిన్న రూరల్.. ఇవాళ ఉదయగిరి వైసీపీలో ముసలం.. ఈసారి ఏం జరుగుతుందో..!?

నెల్లూరు/అమరావతి : 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో (Nellore District) క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీకి (YSRCP) ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోందా..? రానున్న ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) పెనుమార్పులు జరుగుతాయా..? నెల్లూరు పెద్దారెడ్లు (Peddareddy) వైసీపీ అధిష్టానంపై ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేస్తున్నారా..? మొన్న ఆనం.. నిన్న కోటంరెడ్డి.. ఇవాళ మేకపాటి..? రేపు ఇంకెవరో అని వైసీపీలో టెన్షన్ వాతావరణ నెలకొందా..? జిల్లా వైసీపీలో అసలేం జరుగుతోందనే విషయాలపై ప్రత్యేక కథనం.

బాబోయ్ ఎందుకిలా..?

వైసీపీకి కష్టకాలం వచ్చిందని.. భవిష్యత్ చిత్రం ఏమీ బాగోలేదన్న వార్తలకు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల వ్యవహారాలే తార్కాణం అని చెప్పుకోవచ్చు. బాబోయ్.. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగట్లేదు.. జరిగిన పనులకు బిల్లులు రావట్లేదని మొత్తుకున్న వెంకటగిరి (Venkatagiri) ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డికి (Anam Ramnarayana Reddy) షాకిచ్చింది అధిష్టానం. హైకమాండ్‌పై తిరుగుబాటుకు దిగుతారా అంటూ వెంకటగిరి నియోజకవర్గానికి ఇంచార్జ్‌ను కూడా నియమించేసింది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యే సీటు వ్యవహారంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారంలోనూ ఇదే జరిగింది. రేపో.. మాపో నియోజకవర్గ ఇంచార్జ్‌ను నియమించేస్తారు కూడా. ఈ ఇద్దరి వ్యవహారం సద్దుమణగక ముందే ఇదే జిల్లాలో మరో రెడ్డి పంచాయితీ వెలుగులోకి వచ్చింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి పంచాయితీలు బయటికి వస్తుండటంతో అసలు నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోందో అధిష్టానానికి అర్థం కాని పరిస్థితి. ఆనం, కోటంరెడ్డి (Anam-Kotamreddy) ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ (Telugudesam) నుంచే పోటీచేస్తారని అనుచరులు చెప్పుకుంటున్నారట.

Nellore-02.jpg

మేకపాటి ఫ్యామిలీలోనే ఇలా..!

నెల్లూరు జిల్లాను ఏలిన కుటుంబాల్లో మేకపాటి ఫ్యామిలీ (Mekapati Family) ఒకటి. అయితే మునుపటిలో ఈ కుటుంబానికి జిల్లాలో హవా లేకుండాపోయిందనే చర్చ కూడా నడుస్తోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డికి (Mekapati Gowthamreddy) మంత్రి పదవి ఇచ్చిన జగన్.. ఆయన మరణాంతరం అదే కుటుంబంలోని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అయితే ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఆ మధ్య టీటీడీ చైర్మన్ పదవి (TTD Chairmen) మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) ఆశించారని వార్తలు వచ్చాయి. జగన్ (YS Jagan) దృష్టికి ఈ విషయం వెళ్లిందని కూడా టాక్ నడిచింది. ఆ తర్వాత ఏమైందో తెలియట్లేదు కానీ.. కథ మూలన పడింది. అసలు ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో కూడా తెలియట్లేదు. బీసీ నేతకు చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా చర్చ నడుస్తోంది. ఈ మధ్య జగన్ బీసీ (BC) మంత్ర జపిస్తుండటంతో.. ఆ వర్గం నేతకే పదవి కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంలో జగన్‌పై మేకపాటి రాజమోహన్ తీవ్ర అసంతృప్తితోనే రగిలిపోతున్నారని సమాచారం.

Kotam-Reddy.jpg

ఉదయగిరి వైసీపీలో ముసలం..

మేకపాటి కుటుంబ సభ్యుడు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉదయగిరి నియోజకవర్గం (Udayagiri) వైసీపీలో ముసలం చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది. నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డికి (Dhanunjaya Reddy).. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి (MLA Chandrasekhar Reddy) అసలు పడట్లేదు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది. ఈసారి ఏకంగా ధనుంజయరెడ్డిని తిట్టిపోశారు ఎమ్మెల్యే. వైఎస్ కుటుంబానికి (YS Family) వీరవిధేయుడునైన తనపైనే ధనుంజయరెడ్డి పెత్తనమేంటి..? అని ఎమ్మెల్యే కన్నెర్రజేస్తున్నారు. నియోజకవర్గంలో వర్గపోరును ఆయన అనవసరంగా రగిలిస్తున్నారని ఆగ్రహానికి లోనయ్యారు ఎమ్మెల్యే. ఈ వ్యవహారంపై సీఎం జగన్‌కు ఫిర్యాదు కూడా చేశానని మీడియా ముఖంగా చెప్పారు. అసలు టీడీపీ నేత (TDP Leader) అయిన ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా ఎలా నియమిస్తారు..? అని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా తప్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జగన్, జిల్లా మంత్రి దగ్గరే తేల్చుకోవడమే కాదు.. దేనికైనా సిద్ధమేనని కూడా హెచ్చరించారు. అయితే.. ఈ వ్యవహారంలో జగన్ ఎలా రియాక్ట్ అవుతారు..? జగన్ నుంచి వచ్చే స్పందనను బట్టి చంద్రశేఖర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది.

Nellore-Udayagiri.jpg

మొత్తానికి చూస్తే.. నెల్లూరు పెద్దారెడ్ల పంచాయితీ మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఒక్కొక్కరుగా అధిష్టానంపై తిరుగుబాటు చేయడంతో ఇవన్నీ టీడీపీకి ప్లస్‌గా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో కచ్చితంగా మార్పులు వస్తాయని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మున్ముందు నెల్లూరు జిల్లా వైసీపీలో ఇంకెందరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెల్లగక్కుతారో వేచి చూడాలి మరి.

Nellore-Mekapati.jpg

Updated Date - 2023-02-01T22:51:24+05:30 IST