AP Politics: వైరల్ అవుతున్న ఆర్నాబ్-లోకేష్ చర్చ.. బ్రింగ్ ఇట్ ఇన్..!!

ABN , First Publish Date - 2023-09-16T17:58:30+05:30 IST

జాతీయ మీడియాలో ఆర్నాబ్ గోస్వామితో చర్చ సందర్భంగా నారా లోకేష్ వాడిన బ్రింగ్ ఇట్ ఇన్ అనే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు గురించి ఆర్నాబ్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ తడుముకోకుండా సమాధానాలు చెప్పడం హైలెట్‌గా నిలుస్తోంది.

AP Politics: వైరల్ అవుతున్న ఆర్నాబ్-లోకేష్ చర్చ.. బ్రింగ్ ఇట్ ఇన్..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు నేషనల్ మీడియాలో మార్మోగిపోతోంది. శుక్రవారం రాత్రి రిపబ్లిక్ టీవీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వివరాలపై ఆర్నాబ్ గోస్వామితో లోకేష్ చర్చించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఆర్నాబ్‌తో డిబేట్ అంటే రాజకీయ నేతలు ముందుకు రారు. ఎందుకంటే ఆయన కఠినమైన, విచిత్రమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అందుకే ఆయనతో లైవ్ డిబేట్ అంటే వెనకడుగు వేస్తారు. ఇటీవల చంద్రబాబుకు సీమెన్స్ సంస్థ ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్‌రెడ్డిని ఆర్నాబ్ గోస్వామి అడగ్గా.. ఆయన నీళ్లు నమిలారు. అది సీఐడీ విచారిస్తోందని.. అందుకోసమే చంద్రబాబును అదుపులోకి తీసుకుందని బుకాయింపు సమాధానం చెప్పారు. కానీ చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా లోకేష్ ఎంతో ధైర్యం చేసి ఆర్నాబ్‌తో చర్చలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన అడిగిన ప్రశ్నలకు దుమ్మురేపేలా సమాధానాలు ఇచ్చారు. ఏపీ సీఎం జగన్‌కు సవాల్ కూడా విసిరారు.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై అధికార పార్టీ వైసీపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని నారా లోకేష్ ఆర్నాబ్ చర్చలో స్పష్టం చేశారు. చట్టాలను.. వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తే సివిల్ వార్ వస్తుందని.. దానికి తాము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగానే చెప్పారు. ఈ కేసు విషయంలో వైసీపీ నేతలతో ఎందుకు బహిరంగ చర్చ చేయడం లేదని ఆర్నాబ్ ప్రశ్నించగా లోకేష్ వైసీపీ నేతలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. బుర్ర తక్కువ వాళ్లతో.. అన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడేవాళ్లతో తాము ఏం మాట్లాడతామని ఎదురుప్రశ్న వేశారు. జగన్‌తో ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. బ్రింగ్ ఇట్ ఆన్ అని లోకేష్ ఆన్సర్ ఇచ్చారు. దమ్ముంటే చర్చకు రావాలని జగన్‌ను సవాల్ చేశారు. 14 ఏళ్ల పాటు తమ తండ్రి క్లీన్ ఇమేజ్‌తో రాజకీయాల్లో కొనసాగుతున్నారని.. ఆధారాలు లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా తమ తండ్రిని ఎలా అరెస్ట్ చేస్తారని లోకేష్ జాతీయ మీడియా వేదికగా లేవనెత్తారు.

ఇది కూడా చదవండి: NCBN Arrest : లోకేష్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..?

మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు గురించి ఆర్నాబ్ అడిగిన అన్ని ప్రశ్నలకు లోకేష్ తడుముకోకుండా సమాధానాలు ఇచ్చాడు. ప్రభుత్వం 10 శాతం, సీమెన్స్ 90 శాతం భరించడం.. 19 రోజుల్లోనే నిధులు విడుదల చేయడం వంటి ప్రశ్నలను ఆర్నాబ్ గోస్వామి అడిగారు. ఈ సందర్భంగా 90 శాతం అనేది గుజరాత్‌లోనూ అమలు చేశారని.. అందుకే తాము 90 శాతం కాంట్రాక్టును సీమెన్స్‌కు ఇవ్వడం జరిగిందని లోకేష్ వివరించారు. అయితే అది నగదు కోసం కాదు అని.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కొనుగోళ్ల కోసం అని తెలిపారు. తాము తెచ్చిన ఈ ప్రాజెక్టు ద్వారా 2.13 లక్షల మంది అభ్యర్థులు ట్రైనింగ్ పొందారని.. 80వేల మంది ఉద్యోగాలు సంపాదించారని ఆర్నాబ్‌కు లోకేష్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలులో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచిందని.. 2019లో సీఎం జగన్ ఈ ప్రాజెక్టును తామే అమలు చేసిన తరహాలో క్లెయిమ్ చేసుకున్నట్లు గుర్తుచేశారు. కాగా లోకేష్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-16T17:58:30+05:30 IST