AP Politics: విద్యార్థులకు గురువులు అవసరం లేదా? అందుకేనా టీచర్లకు జీతాలు ఆపేసింది..?

ABN , First Publish Date - 2023-09-06T19:26:56+05:30 IST

గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని.. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. గురువుల కన్నా గూగుల్లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందని చెప్పారు. టీచర్లకు తెలియని ఎన్నో అంశాలు గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని మంత్రి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది.

AP Politics: విద్యార్థులకు గురువులు అవసరం లేదా? అందుకేనా టీచర్లకు జీతాలు ఆపేసింది..?

గురుపూజోత్సవం రోజు గురువులపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని.. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. గురువుల కన్నా గూగుల్లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందని చెప్పారు. టీచర్లకు తెలియని ఎన్నో అంశాలు గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని మంత్రి అన్నారు. దీంతో టీచర్స్ డే కార్యక్రమంలోనే టీచర్లను మంత్రి ఆదిమూలపు సురేష్ ఘోరంగా అవమానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది.

నిజమే.. ప్రపంచ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అయితే టెక్నాలజీ గురించి చెప్పడానికి గురువు అవసరం లేదని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటేనే అది ఉపయోగపడుతుంది. మరి అలాంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో చెప్పేందుకు గురువు ముమ్మాటికీ అవసరమే. పుస్తకాలను చూసి పాఠాలు చెప్పడమే కాకుండా జీవితాలను పాఠాలుగా బోధించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చినా గురువు స్థానాన్ని గూగుల్ భర్తీ చేయలేదు. గతంలోనూ ఇదే విషయాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రపంచం శరవేగంగా దూసుకెళ్తున్నా.. గూగుల్ అందుబాటులో ఉన్నా.. విద్యార్థులకు గురువు అవసరమేనని.. ఆ స్థానాన్ని ఎన్నటికీ గూగుల్ భర్తీ చేయలేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలకు భిన్నంగా మంత్రి ఆదిమూలపు సురేష్ బడాయి మాటలు మాట్లాడి టీచర్ల పరువు తీశారు. ఆయన కూడా ఓ టీచర్ అన్న విషయాన్ని మరిచిపోయారు. విద్యార్థులకు బైజూస్ ల్యాప్‌టాప్‌లు ఇచ్చి గూగుల్‌లో పాఠాలు చదువుకుంటే మార్కులు వస్తాయని మంత్రి హామీ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకేనా ఏపీలో టీచర్లకు జీతాలు ఇవ్వడం మానేశారంటూ ఎద్దేవా చేస్తున్నారు.


ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రమశిక్షణ అవసరం. గురువు ఉంటేనే విద్యార్థి సక్రమ మార్గంలో నడవగలడు. గూగుల్‌తోనే విద్యను అభ్యసించాలంటే కాలేజీలు, స్కూళ్లు ఎందుకు అంటూ ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తు్న్నారు. భవిష్యత్‌లో స్కూళ్లు, కాలేజీలను మూసేస్తారా అని నిలదీస్తున్నారు. టీచర్లను అగౌరవపరిచిన వాడు బాగుపడినట్లు చరిత్రలో లేదన్న విషయం గుర్తుంచుకోవాలని నెటిజన్‌లు హితవు పలుకుతున్నారు. అటు మంత్రి సురేష్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి. టీచర్స్ డే నాడు గురువులకు సన్మానం చేశారో లేదా అవమానం చేశారో మంత్రి తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుపూజోత్సవం రోజే గురువుల సన్మాన సభలో ఉపాధ్యాయులను అవమానించడం తగదన్నారు. గురువుకు టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గూగుల్ చదువులు లేవని.. గురువులే చదువులు చెప్తున్నారని గుర్తుచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Power Cuts in AP: జగన్ పాలనలో ఉక్కపోత.. వర్షాకాలంలో ఎడాపెడా కరెంట్ కోతలు

కాగా తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చేసరికి మంత్రి సురేష్ ప్లేటు ఫిరాయించారు. తాను గురువులను అవమానించలేదని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొంతమంది గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని.. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. తన తల్లిదండ్రులు ఉపాధ్యాయులేనని.. తాను గురువులను గౌరవిస్తానని కవరింగ్ చేసుకున్నారు.

Updated Date - 2023-09-06T19:34:24+05:30 IST