AP Politics: ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలు.. అంత భయం ఎందుకో?

ABN , First Publish Date - 2023-08-17T13:53:46+05:30 IST

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలను ప్రవేశపెడుతూ వాళ్లను ఏమార్చేందుకు తనకు తెలిసిన రీతిలో కుయుక్తులు పన్నుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా పేరుతో కొన్ని రోజుల గ్యాప్‌లో వరుస సర్వేలతో హడావిడి చేస్తోంది. గతంలో ఎన్డీటీవీ పేరుతో ఓ సర్వేను.. తాజాగా టైమ్స్ నౌ పేరుతో ఓ సర్వేను విడుదల చేసి మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే రీతిలో ప్రజలను మభ్యపెట్టింది.

AP Politics: ప్రజల నెత్తిన వైసీపీ బోగస్ సర్వేలు.. అంత భయం ఎందుకో?

ఏపీలోని వైసీపీ సర్కారు పూర్తిగా డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల నెత్తిన బోగస్ సర్వేలను ప్రవేశపెడుతూ వాళ్లను ఏమార్చేందుకు తనకు తెలిసిన రీతిలో కుయుక్తులు పన్నుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా పేరుతో కొన్ని రోజుల గ్యాప్‌లో వరుస సర్వేలతో హడావిడి చేస్తోంది. గతంలో ఎన్డీటీవీ పేరుతో ఓ సర్వేను.. తాజాగా టైమ్స్ నౌ పేరుతో ఓ సర్వేను విడుదల చేసి మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే రీతిలో ప్రజలను మభ్యపెట్టింది. ఈ సర్వేలతో జగన్ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. కొందరు వైసీపీ మద్దతుదారులు ఈ సర్వేలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను గేలి చేస్తూ పోస్టులతో రెచ్చిపోతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉండటంతో సదరు సర్వేలను చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. గతంలో సదరు సంస్థలకు కోట్లకు కోట్లు చెల్లించి డీల్ కుదుర్చుకుని ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో తమ పార్టీకి మెజారిటీ వస్తుందని ప్రజలను నమ్మించేందుకు వైసీపీ విఫల ప్రయత్నం చేస్తోంది. 2020లోనే టైమ్స్ నౌ సంస్థకు రూ.8.15 కోట్లు జగన్ సర్కారు చెల్లించిందని ది ప్రింట్ సంస్థ అప్పట్లోనే నిజాన్ని బహిర్గతం చేసిన విషయాన్ని పలువురు ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

times now.jpg


ఏపీలో గత నాలుగున్నరేళ్ల కాలంలో అన్ని రంగాలలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక ప్రభుత్వంగా రికార్డుల్లోకి ఎక్కింది. మద్యపాన నిషేధం అంటూ అబద్దాలు చెప్పింది. అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించింది. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది. రూ.3వేలు ఫించన్ ఇస్తామని చెప్పి విడతల వారీ అంటూ ప్రజల చెవిలో పువ్వులు పెట్టింది. నవ రత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడుతోంది. అప్పుల పేరుతో రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ప్రతిపక్ష నేతలను కేసుల పేరుతో వేధిస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించింది. ఉత్తుత్తి దిశా చట్టం తీసుకొచ్చి మహిళలకు రక్షణ లేకుండా చేసింది. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇతర పార్టీల మహిళా నేతలను హింసిస్తోంది. అహంభావంతో సినిమా వాళ్లను తన కాళ్ల దగ్గరకు వచ్చేలా వైసీపీ సర్కారు కుట్రలకు పాల్పడింది. కొత్త రాష్ట్రంలో విరివిగా పెట్టుబడులకు అవకాశం ఉన్నా అదేమీ పట్టించుకోకుండా ఉన్న కంపెనీలను బెదిరించింది. అమర్ రాజా, లూలూ గ్రూప్ వంటి కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది. ఐటీ రంగాన్ని అయితే గాలికొదిలేసింది. కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు అంటూ ప్రజలపై భారం మోపింది. మద్యం ధరలు విపరీతంగా పెంచి నాసిరకం సరుకును సరఫరా చేస్తోంది.

అటు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సగం సీట్లను లక్షల రూపాయలకు జగన్ సర్కారు అమ్మేస్తోంది. పేదలకు ఇచ్చే రేషన్‌లోనూ కోతలు విధించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా ఏడిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మిస్తే చంద్రబాబు అకౌంట్‌లోకి వెళ్తుందన్న దుర్బుద్ధితో ఏకంగా రాజధానినే మార్చేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. అరాచకాలు, అక్రమాలతో పాలన కొనసాగిస్తున్న జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని గ్రహించి సర్వేలను నమ్ముకుంది. దీంతో జాతీయ మీడియా పేరుతో వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఫలితాలను వెల్లడిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బోగస్ ఓట్లను సృష్టిస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో వాలంటీర్లను ఇంటింటికి పంపించి వాళ్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తూ తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తూ నీచ రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోంది. ప్రతిపక్షాలు స్పందించి ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బోగస్ సర్వేలను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైసీపీకి ఎలా ఓటేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలకు ప్రజాదరణ చూసి జగన్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. అందుకే బోగస్ సర్వేలను ప్రజలపై రుద్దాలని చూస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: MVV Satyanarayana: జగన్‌పై అందుకే కేసులు.. వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ వైరల్

Updated Date - 2023-08-17T13:53:46+05:30 IST