Andhra Pradesh: వెలవెలబోతున్న కృష్ణా బేసిన్.. ఇదేనా జగన్ పాలనలో స్వర్ణయుగం?

ABN , First Publish Date - 2023-08-30T17:07:18+05:30 IST

తమ పాలనలో వర్షాలు సమృద్ధిగా పడతాయని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలకు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి అంతుచిక్కడం లేదు. కృష్ణా బేసిన్‌లో ఒకవైపు నీళ్లు లేకపోవడం.. మరోవైపు కరెంట్ కోతలతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదేనా జగన్ పాలనలో స్వర్ణయుగం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.

Andhra Pradesh: వెలవెలబోతున్న కృష్ణా బేసిన్.. ఇదేనా జగన్ పాలనలో స్వర్ణయుగం?

ప్రకృతి ఆధార పరిస్థితులను కూడా తమ క్రెడిట్‌గా చెప్పుకోవడంలో వైసీపీ నేతలకు ఎవ్వరూ సాటిరారు. సమృద్ధిగా వర్షాలు పడితే తమ క్రెడిట్‌గా చెప్పుకుని.. పడకపోతే ప్రతిపక్షంపై విమర్శలు చేసే వైసీపీ నేతలకు ఏపీలో ప్రస్తుత పరిస్థితి అంతుబట్టని మిస్టరీగా మారింది. ఇటీవల గోదావరి బేసిన్‌లో వర్షాలు బాగానే పడినా కృష్ణా బేసిన్‌‌లో మాత్రం వరద ప్రవాహం లేదు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతం వెలవెలబోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. ఒకవైపు నీళ్లు లేకపోవడం.. మరోవైపు కరెంట్ కోతలతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదేనా జగన్ పాలనలో స్వర్ణయుగం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. దేవుడి దయతో వర్షాలు పడుతున్న ఈ ప్రభుత్వం కావాలా అంటూ గతంలో వైసీపీ సోషల్ మీడియా చేసిన పోస్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనలో కరువు పరిస్థితి వచ్చిందని.. దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.

ysrcp  tweet.jpg

సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి. అయితే ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2002-03, 2003-04, 2015-16 సంవత్సరాల కంటే ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని అధికారులే చెప్తున్నారు. మాములుగా అయితే ఆగస్టు నాటికి కృష్ణా బేసిన్‌లోకి 25-30 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కాస్త ఆలస్యంగా అయినా 100 టీఎంసీలు వచ్చేవి. ఆగస్టు తొలివారం లేదా రెండో వారంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లలో జల కళ కనిపించేది. దీంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆగస్టు నెల పూర్తి కావొచ్చినా కృష్ణా బేసిన్‌లో చుక్క నీరు లేకపోవడం రైతులను కష్టాల్లోకి నెడుతోంది. ఎగువ ప్రాంతంలో ఉన్న ఆల్మట్టి డ్యాంలో కూడా నీటి నిల్వ లేకపోవడం కరువు పరిస్థితులను సూచిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్ని ప్రధాన రిజర్వాయర్లు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.

ఇది కూడా చదవండి: Roja Selvamani: అప్పుడు చెత్త నటుడు అని విమర్శ.. ఇప్పుడు ఆయన డైలాగ్‌తో ఎలివేషన్‌లు

మరోవైపు బచావత్ ట్రిబ్యునల్ తెలుగు రాష్ట్రాలకు సంయుక్తంగా 811 టీఎంసీలు కేటాయించగా.. ఇందులో 450 టీఎంసీలు ఎగువ నుంచి తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులకు రావాలి. ఆల్మట్టి నుంచి ఎక్కువగా, తుంగభద్ర నుంచి కొంత రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల్లోకి అసలు ప్రవాహం లేదు. ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితి దాపురించింది. కృష్ణా పరివాహక ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట మండలాలలో పత్తి, మిర్చి, మినుము, మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వైసీపీ హయాంలో వ్యవసాయానికి 5 గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో వర్షాలు పడని సందర్భాల్లో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు.

Updated Date - 2023-08-30T17:07:18+05:30 IST