Share News

BalaKrishna: గచ్చిబౌలి సభపై బాలయ్య ట్వీట్.. టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు

ABN , First Publish Date - 2023-10-30T17:15:34+05:30 IST

హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

BalaKrishna: గచ్చిబౌలి సభపై బాలయ్య ట్వీట్.. టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఏపీ వ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. సీఎం జగన్ కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పలు రకాలుగా నిరసలు చేపడుతోంది. ఈ మేరకు ఆదివారం నాడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ గ్రాటిట్యూడ్ కార్యక్రమం నిర్వహించింది. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావాన్ని తెలిపేందుకు వీలుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ కావడంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గచ్చిబౌలిలో చంద్రబాబుకు కృతజ్ఞతతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి సభకు హాజరైన అభిమానులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబుకు తిరుగులేని మద్దతు ఇచ్చారని.. ఈ సభ ద్వారా అభిమానులు తమ ప్రియతమ నేత పట్ల చూపించిన ప్రేమ, గౌరవం తనను కదిలిచిందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. విజనరీ నేతగా పేరు పొందిన చంద్రబాబును జైలులో పెట్టినా రాజకీయంగా తాము దృఢంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పెట్టిన కేసులు రాజకీయ కక్షతోనే పెట్టారని తాము విశ్వసిస్తున్నామని.. తాము కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ సభ ద్వారా అభిమానులు సంఘీభావం తెలపడం ఎంతో ఉత్సాహాన్ని నింపిందన్నారు. అనివార్య కారణాల వల్ల తాను ఈ సభకు హాజరుకాలేకపోయినా అభిమానులు చూపించిన నమ్మకానికి, నిబద్ధతకు రుణపడి ఉంటానని.. చంద్రబాబుకు ఇది కొండంత బలాన్ని ఇస్తుందని బాలయ్య పేర్కొన్నారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి విడుదల అవుతారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

balayya tweet.jpg

Updated Date - 2023-10-30T17:17:30+05:30 IST