Share News

TAMA: గగన వీధుల్లో విహరించిన యువత.. చరిత్ర సృష్టించిన ‘తామా డిస్కవరీ ఫ్లైట్’

ABN , First Publish Date - 2023-11-03T10:32:58+05:30 IST

చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు అగస్టా ఫ్లైట్ స్కూల్ వారి సౌజన్యంతో అక్టోబర్ 28, 29న స్థానిక చెరోకీ కౌంటీ ఎయిర్ పోర్ట్‌లో ‘డిస్కవరీ ఫ్లైట్’ నిర్వహించారు.

TAMA: గగన వీధుల్లో విహరించిన యువత.. చరిత్ర సృష్టించిన ‘తామా డిస్కవరీ ఫ్లైట్’

TAMA: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు అగస్టా ఫ్లైట్ స్కూల్ వారి సౌజన్యంతో అక్టోబర్ 28, 29న స్థానిక చెరోకీ కౌంటీ ఎయిర్ పోర్ట్‌లో ‘డిస్కవరీ ఫ్లైట్’ నిర్వహించారు. రెండు రోజులకు కలిపి 16 స్లాట్స్ ఉండడంతో యువతకు మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా తామా సంస్థ తమకు యువత ఎంత ముఖ్యమో తెలియజెప్పింది.

MMMMMMM.jpg

ఇక ప్యాసెంజర్ ఫ్లైట్స్ ఓవర్ బుక్ అయినట్టుగా, ఇక్కడ కూడా చాలా మంది ఉత్సాహం చూపారు. వారిలో త్వరగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటిసారి కాబట్టి చాలా మందికి అర్థం కాలేదు. కొందరు సిములేషన్ అనుకున్నారు. కొందరు థియరీ క్లాస్ అనుకున్నారు. అసలు డిస్కవరీ ఫ్లైట్ అంటే ఏంటంటే.. ఫ్లైట్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఒక గంట పాటు జరిగే పైలట్ ట్రైనింగ్. దీన్ని ఫస్ట్ అవర్ ఫ్లైట్ అని కూడా అంటారు.

MMMMMM.jpg

అగస్టా ఫ్లైట్ స్కూల్ సమతా శెట్టి, నంది శెట్టి, అఖిల్ ఇన్స్ట్రక్షన్‌లో 10 నుండి 20 సంవత్సరాల మధ్య పిల్లలు హుషారుగా ఆకాశంలో షికారు చేశారు. ట్రైనీతో పాటు మరొక్కరు వెళ్ళడానికి అవకాశం ఉండటంతో తోబుట్టువులు లేక తల్లిదండ్రులలో ఒకరు వెళ్లడం జరిగింది. ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల చిన్న చిన్న కొండలు, చెట్లు, మంచి ఫాల్ కలర్స్ ఉండడం వల్ల ఆకాశ యాత్ర మరింత శోభాయమానంగా సాగింది. సముద్రపు మట్టం నుండి సుమారు 3 నుంచి 4 వేల అడుగుల ఎత్తులో సాగిన ఈ ట్రైనింగ్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన సెస్నా 172 ఫ్లైట్ ఉపయోగించారు. 2023లో ఇది తామా వారి 23వ కార్యక్రమం. రాబోయే రోజులలో విల్ & ట్రస్ట్ గ్రాండ్ మేళా, చెస్, దీపావళి ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగనున్నాయి. వివరాల కోసం www.tama.org ని సందర్శించడం లేదా info@tama.orgకి ఇమెయిల్ చేయవచ్చు.

MMMMMMMM.jpg

ట్రైనింగ్‌లో పాల్గొన్న వారందరికీ ఫ్లైట్ అఫీషియల్ లాగ్ బుక్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా ట్రైనింగ్ కొనసాగిద్దామనుకుంటే వారు సెకండ్ అవర్ ఫ్లైట్‌లో చేరవచ్చు. అందరూ ఎయిర్ పోర్ట్‌లోపలికి వెళ్లడం, రన్ వే, ఫ్లైట్లను దగ్గర నుండి చూడడం ఒక ప్రత్యేక అనుభూతి. పాల్గొన్న పిల్లలు చాలా థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పారు. కొందరు భవిష్యత్తులో కొనసాగిస్తామని అన్నారు. పెద్దవాళ్ల ఆనందానికి హద్దులు లేవు. తామా వారు ఇలాంటి వైవిధ్యమైన కార్యక్రమాలు చాలా చేస్తున్నారని, మరిన్ని చేయాలని ఆకాంక్షించారు.

MMMMM.jpg

తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి, టెక్నాలజీ కార్యదర్శి సునీల్ దేవరపల్లి, కమ్యూనిటీ కార్యదర్శి సత్య గుత్తుల.. ఎయిర్ పోర్ట్ సిబ్బంది, నంది శెట్టి, అఖిల్‌ను ఘనంగా సత్కరించారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇలాంటి కార్యక్రమం తాము మొదటిసారి చూస్తున్నామనీ, చాలా బాగుందని కితాబిచ్చారు. సాధారణంగా 50 సంవత్సరాల పైబడ్డ వారికి శిక్షణ ఇస్తుంటానని, ఇలా ఇంత మంది యువతకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు అఖిల్. ఇదొక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.

MMMM.jpg

ఇప్పటిదాకా ఏ సంస్థ ఇలాంటి కార్యక్రమం చేయలేదని, తామా వారు ఇలా ముందుకు రావడం ఒక గొప్ప విషయం అని ప్రశంసించారు. ఇలా ఎందరో ముందుకు రావాలని అన్నారు. ఈ ఆలోచన చేసి, ఆచరించి చూపిన సాయిరామ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ అరుదైన, అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన అందరికీ సాయిరామ్ కృతజ్ఞతలు తెలిపి, దిగ్విజయంగా ముగించారు.

MMM.jpg

Updated Date - 2023-11-03T10:32:59+05:30 IST