NRIs: రియాధ్‌లో ‘తెలుగు కుటుంబాల సమ్మేళనం’ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు
ABN , First Publish Date - 2023-01-19T21:42:23+05:30 IST
సంక్రాంతి (Sankranthi) సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. అది మాతృభూమి గానీ విదేశీ గడ్డ కానీ పంటల పండుగకు మినహాయింపు కాదు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సంక్రాంతి (Sankranthi) సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. అది మాతృభూమి గానీ విదేశీ గడ్డ కానీ పంటల పండుగకు మినహాయింపు కాదు. ఏ దేశమేగినా ఎందుకాలెడినా పంటల పండుగ పంటల పండుగే. సొంత ఊరిలో చేతికు వచ్చిన కొత్త పంటలతో దేవుడికి నైవేథ్యం పెట్టే అవకాశం ఎడారినాట లేకున్నా... కొత్త బియ్యంతో చేసిన అరిసెలు లేదా మొక్కజొన్న గారెలు తినే అవకాశం లేకపోయినా.. సౌదీ అరేబియాలోని (Saudi Arabia) కొన్ని తెలుగు కుటుంబాలు మాత్రం ‘ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తమ్మెదా’.. అంటూ మొక్కజొన్న కంకులను కాల్చి సంక్రాంతి అతిథులకు తినిపించి అందరినీ అశ్చర్యపరిచాయి.

రియాధ్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం’ (Riyadh Telugu Families Association) అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఎముకలు కొరికే చలిలో భోగి మంటలలో ప్రత్యేకంగా మొక్కజొన్న కంకులను కాల్చి తినిపించడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక మంది మొక్కజొన్న కంకులు (కండెలు) తింటూ తమ గ్రామీణ భారతంలో గడిపిన బాల్య మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఆధ్యాత్మిక వాతావరణంలో సౌజన్య భగవద్గీత ప్రవచనాలతో అంకురార్పణ జరిగిన సంక్రాతి సంబరాలను మంటల చుట్టూ కలిసిమెలసి కోలాటాలతో సంప్రదాయ వస్త్రధారణతో ఉరకలేసే ఉత్సాహంతో వేడుకలను మరింత కోలాహలంగా మార్చారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మల్లారం గ్రామానికి చెందిన అజయ దంపతులకు విదేశీ గడ్డపై ఇదే ప్రప్రథమ పండుగ అయినా తాము ప్రవాసంలో ఉన్నట్లుగా మరిచిపోయి స్వదేశంలోనే ఉన్నట్లుగా పండుగను ఆనందోత్సహంగా జరుపుకున్నారు.
రంగురంగుల ముగ్గులు మగువల ప్రతిభకు అద్దం అని వాకాటి శ్రీదేవి, సింధూ, మణి, మను, బిందు గంధవల్లి, నిరూప భూమేని, అనూష స్వర్ణ ఇతర మహిళలతో కలిసి తమ కళ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడమమే కాదు. మొత్తం వేడుకల తతంగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా నాయకత్వంలో మగవారికి కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించారు.

ఇక సంక్రాంతి ప్రాధాన్యత గురించి సురేఖ విశదీకరించారు. రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంఘ ప్రతినిధులు తిరుపతి స్వామి స్వర్ణ, భాస్కర్, మహేంద్ర, నటరాజ్, జవహార్, అనిల్ మర్రి, ఇబ్రహీం శేఖ్, నాగేంద్ర, శేషు బాబు, మురారి, ప్రసాద్ బోడె, శ్రీనివాస్ ముచ్చు, ఆర్.వి.పి.ప్రసాద్, షేక్ జిలానీలు వేడుకలకు తమ తోడ్పాటునందించారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్, ఇతర క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సుఖేష్, గుత్తు ఇండియన్ రెస్టారెంట్, ధన్యశ్రీ స్వర్ణ మరియు రిషిత్ స్వర్ణ, బిందు భాస్కర్ నగదు బహుమతులు, ట్రోఫీలను అందించగా.. పిల్లలకు, పెద్దలకు మెడల్స్‌ను నరేంద్ర పెళ్లూరు ప్రదాన చేశారు. క్రీడాకారులను ప్రముఖలు నాగేశ్వరరావు మట్టపర్తి, ఎర్రన్న, వెంకటేశ్వర్లు దండా, ఆదినారాయణ దాసరి, అనిల్ మర్రి, దేవరాజ్, సతీష్ అభినందించినట్లుగా నిర్వహకులు తెలిపారు.