Kuwait: ప్రవాసులకు కొత్త పరీక్ష.. ఫెయిల్ అయితే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2023-06-09T08:16:04+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు మరో టెస్ట్‌ను రెడీ చేసే పనిలో ఉంది. దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేసేందుకు ఇలా కువైత్ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని డ్రగ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది.

Kuwait: ప్రవాసులకు కొత్త పరీక్ష.. ఫెయిల్ అయితే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసులకు (Expatriates) మరో టెస్ట్‌ను రెడీ చేసే పనిలో ఉంది. అదే.. డ్రగ్-ప్రీ టెస్ట్ (Drug Free Test). దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేసేందుకు ఇలా కువైత్ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని డ్రగ్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది. తద్వారా ప్రారంభంలోనే డ్రగ్స్ (Drugs) దేశంలోకి రాకుండా నిషేధించవచ్చని భావిస్తుంది. కొత్తగా వచ్చేవారికి చేసే మెడికల్ టెస్టుల్లో భాగంగా ఈ డ్రగ్ టెస్టు కూడా నిర్వహించాలని చూస్తోంది. ఇప్పటికే ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) కసరత్తు మొదలెట్టిందని అధికారిక సమాచారం. ఇక ఈ డ్రగ్ టెస్ట్ నెగేటివ్ రిపోర్టును వలసదారులకు జారీ చేసే వివిధ రకాల వీసాలకు అనుసంధానం చేస్తారట.

ప్రధానంగా వర్క్, విజిట్, ఫ్యామిలీ జాయినింగ్ వీసాలతో పాటు నివాస వీసాలను రెన్యువల్ చేసే సమయంలో ఈ టెస్ట్ రిపోర్ట్ చూసిన తర్వాతే మిగతా ప్రాసెస్ ఉంటుందట. రెసిడెన్సీ రెన్యువల్ కోసం వెళ్లే నివాసితులు డ్రగ్ టెస్టు చేయించుకున్న తర్వాత దాని తాలూకు రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇంటరీయర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ (Ministry of Health) సంయుక్తంగా పరీక్ష కేంద్రాలను గుర్తించే పనిలో ఉన్నాయి. అలాగే ఆ సెంటర్స్‌లో కావాల్సిన మెడికల్, ఇతర సామాగ్రిని సమకూర్చుకునేందుకు యత్నిస్తున్నాయి. దీంతో పాటు బయోమెట్రిక్ సెంటర్స్ (Biometric Centers), స్పెషలైజడ్ మెడికల్ మరియు సెక్యూరిటీ సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయని తెలిసింది. ఇక ఈ డ్రగ్ టెస్టులో ప్రవాసులకు పాజిటివ్ వస్తే మాత్రం తట్టాబుట్టా సర్దుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పరీక్షలో డ్రగ్ తీసుకున్నట్లు తేలితే వెంటనే దేశం నుంచి బహిష్కరించడం, వీసా రెన్యువల్ నిలిపివేయడం చేస్తారు.

Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!


Updated Date - 2023-06-09T08:16:36+05:30 IST