London: భారత హై కమిషన్‌ వద్ద ఖలిస్థాన్‌ మూకల ఉన్మాదం.. జాతీయ జెండాకు ఘోర అవమానం.. ధీటుగా స్పందించిన హై కమిషన్‌

ABN , First Publish Date - 2023-03-21T07:47:14+05:30 IST

కొన్నాళ్ల నుంచి కెనడా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వేదికగా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్‌ అనుకూల వర్గాలు.. అమృత్‌పాల్‌ సింగ్‌ ఉదంతం నేపథ్యంలో మరింత పెట్రేగాయి.

London: భారత హై కమిషన్‌ వద్ద ఖలిస్థాన్‌ మూకల ఉన్మాదం.. జాతీయ జెండాకు ఘోర అవమానం.. ధీటుగా స్పందించిన హై కమిషన్‌

లండన్‌లోని భారత హై కమిషన్‌ వద్ద

జాతీయ జెండా తొలగింపు

తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం

డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిచి నిరసన

శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌పైనా దాడి

ఆస్ట్రేలియా పార్లమెంటు ఎదుట ఆందోళన

దొరకని అమృత్‌ పాల్‌ .. పంజాబ్‌ జల్లెడ

అతడి మామ, డ్రైవర్‌ లొంగుబాటు

లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, మార్చి 20: కొన్నాళ్ల నుంచి కెనడా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వేదికగా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఖలిస్థాన్‌ అనుకూల వర్గాలు.. అమృత్‌పాల్‌ సింగ్‌ ఉదంతం నేపథ్యంలో మరింత పెట్రేగాయి. ఏకంగా లండన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయం ఎదుటనున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించాయి. ఖలిస్థాన్‌ జెండాలు పట్టుకున్న కొందరు నినాదాలు చేస్తూ.. ఆదివారం రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడుతుండగా కనీసం అడ్డుకున్న వారెవరూ లేరు. మరోవైపు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌ ముంగిట ఖలిస్థాన్‌ జెండాలను ఉంచారు. వీటిని తొలగించేందుకు ప్రయత్నించి ముగ్గురు కాన్సులేట్‌ సిబ్బందిపై ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. ఆగ్రహించిన ఖలిస్ధాన్‌ మద్దతుదారులు.. పెద్ద శబ్దంతో పంజాబీ సంగీతం మోగిస్తూ కాన్సులేట్‌లోకి చొరబడ్డారు. రాడ్లతో తలుపులు, అద్దాలు పగుల గొట్టారు. అమృత్‌ను విడుదల చేయాలంటూ గోడలపై రాశారు. కాగా, కాన్‌బెర్రాలో ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు ఎదుట కూడా నిరసనకు దిగారు. ఈ వరుస పరిణామాల రీత్యా కేంద్ర ప్రభుత్వం విషయాన్ని తీవ్రంగా తీసుకుంది.

బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ క్రిస్టినా స్కాట్‌ను పిలిచి విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసింది. కార్యాలయంతో పాటు, సిబ్బంది భద్రతలో లోపాలు ఉన్నాయని.. వేర్పాటువాదులు లోపలకు వస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది ఎవరూ లేరని, ఇది ఏమాత్రం ఆమోదయోగం కాదని స్పష్టం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. కాగా, భారత హై కమిషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామని యూకే అధికారులు హామీ ఇచ్చారు. త్రివర్ణ పతాకం తొలగింపు ఉదంతంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు స్కాట్లాండ్‌ యార్డు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని లండన్‌ పోలీసులు చెప్పారు. ఖలిస్థానీ సానుభూతిపరుల చర్య ఏ మాత్రం ఆమోదనీయం కాదని యూకే విదేశాంగ మంత్రి తారిక్‌ అహ్మద్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌లోని బ్రిటన్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ సైతం ఈ ఘటనను ఖండించారు. జాతీయ జెండా తొలగింపునకు ఖలిస్థాన్‌ అనుకూలురు చేసిన ప్రయత్నం విఫలమైనట్లు భారత హై కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కార్యాలయం వద్ద జాతీయ జెండా రెపరెపలాడుతున్నదని ప్రకటించాయి. కాగా, ఖలిస్థానీల చర్య అనంతరం.. హై కమిషన్‌ దీటుగా స్పందించింది. భవనంపై భారీ జాతీయ జెండాను ఉంచింది.

Updated Date - 2023-03-21T07:47:14+05:30 IST