Indira Eegalapati: హైదరాబాద్‌ మెట్రో టు సౌదీ మెట్రో.. రియాధ్‌లో మెట్రో రైలు నడుపుతున్న హైదరాబాదీ మహిళ..!

ABN , First Publish Date - 2023-03-09T07:51:04+05:30 IST

ఒకప్పుడు కనీసం కారు డ్రైవింగ్‌ చేయడానికి కూడా సౌదీ అరేబియాలో మహిళలకు అనుమతి ఉండేది కాదు.

Indira Eegalapati: హైదరాబాద్‌ మెట్రో టు సౌదీ మెట్రో.. రియాధ్‌లో మెట్రో రైలు నడుపుతున్న హైదరాబాదీ మహిళ..!

రియాధ్‌ మెట్రో రైలు పైలట్‌గా ఇందిర ప్రస్థానం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఒకప్పుడు కనీసం కారు డ్రైవింగ్‌ చేయడానికి కూడా సౌదీ అరేబియాలో మహిళలకు అనుమతి ఉండేది కాదు. ఇప్పుడు శరవేగంగా అమలవుతున్న సంస్కరణల పుణ్యమా అని మహిళలకు అన్ని రంగాల్లోనూ అగ్రతాంబూలం అందుతోంది. మహిళా స్వావలంబనలో భాగంగా మెట్రో రైళ్లను కూడా మహిళలు నడిపే స్థాయికి పురోగమించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు ప్రాంతంలోని ఓ చిన్న పల్లెటూరు నుంచి సౌదీలో మెట్రో రైలు పైలట్‌గా పనిచేసే స్థాయికి ఎదిగిన తెలుగు మహిళ ఈగలపాటి ఇందిర ప్రస్థానం గురించి తెలుసుకుందాం... పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామం ఇందిర స్వస్థలం. ఆమె తండ్రి గ్రామంలో మెకానిక్‌గా పనిచేసేవారు. చిన్ననాటి నుంచే ఇందిర తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆమెకు అన్నదమ్ములు ఎవరూ లేరు. ఇంట్లో ముగ్గురూ ఆడపిల్లలే. తండ్రి వారందరినీ ఉన్నత చదువులు చదివించారు. ఇంజనీరింగ్‌లో పీజీ చేసిన ఇందిర... సాఫ్ట్‌వేర్‌ వైపు కాకుండా అందరి కంటే భిన్నంగా రైళ్ల రంగాన్ని ఎంచుకొంది. హైదరాబాద్‌ మెట్రో రైలులో పైలట్‌గా మూడేళ్లకు పైగా పనిచేసిన ఇందిరకు..

రియాధ్‌ మెట్రోలో పైలట్‌గా అవకాశం వచ్చింది. సౌదీ అరేబియాలోని మెట్రో రైల్వేలో పైలట్లుగా సౌదీ మహిళలు పెద్దసంఖ్యలో ఉన్నారు. రియాధ్‌ మెట్రో ఇంకా అధికారికంగా పరుగులు పెట్టకున్నా ప్రయోగాత్మకంగా మహిళలు అందులో పని చేస్తున్నారు. వారికి తోడుగా ఎంపిక చేసిన కొందరు నిష్ణాతులైన విదేశీ మహిళల్లో ఇందిర ఒకరు. ఖతర్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ పోటీల సందర్భంగా దోహా మెట్రోను నడపడానికి సౌదీ అరేబియా ప్రత్యేకంగా పంపిన మహిళా పైలట్ల బృందంలో ఇందిర కూడా ఉన్నారు. తెలుగు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే ఇందిరకు లోకేశ్‌తో వివాహం కాగా ఆయన కూడా ఖతర్‌లో మెట్రో రైలు పైలట్‌గా పని చేస్తున్నారు. మొదట్లో తాను ఒంటరిగా సౌదీకి వెళ్లడాన్ని బంధువులందరూ వ్యతిరేకించారని, అయినా ఈ ఆటంకాలను లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చానని ఇందిర తెలిపారు. తోటి ఉద్యోగులకు సమాచారం అందించడానికి అరబ్బీ భాష రాకపోవడం తనకు పెద్ద సమస్య కాదంటున్నారు. 15వేల కిలో మీటర్లకు పైగా డ్రైవింగ్‌ లాగ్‌ చేసిన తనకు సౌదీ అరేబియా బాగా నచ్చిందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: 43 లక్షలు దాటిన కువైత్‌ జనాభా.. ప్రవాసుల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు..!

Updated Date - 2023-03-09T09:22:01+05:30 IST