Kuwait: ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం.. ఉల్లంఘనదారుల కోసం మరో ప్లాన్ రెడీ చేసిన గల్ఫ్ దేశం!

ABN , First Publish Date - 2023-08-28T08:09:02+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మునుపటి కంటే ఇప్పుడు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

Kuwait: ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం.. ఉల్లంఘనదారుల కోసం మరో ప్లాన్ రెడీ చేసిన గల్ఫ్ దేశం!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మునుపటి కంటే ఇప్పుడు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వెంటనే దేశం నుంచి బహిష్కరించడం (Deportation) చేస్తోంది. ఇలా గత రెండేళ్ల నుంచి భారీ మొత్తంలో ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు (Residency violators) ఆశ్రయమిచ్చే వారితో పాటు నివాస అనుమతి చట్టాలను ఉల్లంఘించిన వారందరినీ దేశం నుంచి బహిష్కరించేందుకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Interior) పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల కోసం నిర్బంధ కేంద్రాలుగా జలీబ్ అల్ షుయౌఖ్, ఖైతాన్‌లలో ప్రస్తుతం వినియోగించని రెండు స్కూళ్లలను మంత్రిత్వశాఖ ఉపయోగించాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

ఇక మంత్రిత్వశాఖలోని సంబంధిత విభాగాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తుల డేటాను సేకరించి, ఆపై రెసిడెన్సీ చట్టాల (Residency Acts)ను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయాలని ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకుని కువైత్ నుంచి బహిష్కరించడానికి మంత్రిత్వశాఖ ఇప్పటికే జలీబ్ అల్ షుయౌఖ్, ఖైతాన్, ఫర్వానియా, మహ్బౌలా, అమ్ఘరా, అల్-మజ్రా, అల్-జవాఖిర్ తదితర ప్రాంతాల్లో భద్రతా గస్తీని పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నట్లు సంబంధిత అధికారుల వద్ద డేటా ఉన్నట్లు సమాచారం. కాగా, రెసిడెన్సీ ఉల్లంఘించిన వారికి సహాయం చేస్తున్న ప్రవాసులు కూడా బహిష్కరణను ఎదుర్కొంటారని తెలిసింది. అలాగే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సహకరించే కువైత్ పౌరులు లేదా కంపెనీలు సైతం చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!

Updated Date - 2023-08-28T10:12:10+05:30 IST