UAE: కొత్త రూల్.. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనట..!

ABN , First Publish Date - 2023-02-15T10:56:18+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు చెందిన కస్టమ్స్ విభాగం ఆ దేశానికి వెళ్లే లేదా అక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త నిబంధన తీసుకొచ్చింది.

UAE: కొత్త రూల్.. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనట..!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు చెందిన కస్టమ్స్ విభాగం ఆ దేశానికి వెళ్లే లేదా అక్కడి నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. 60వేల దిర్హమ్స్ (రూ.13.53లక్షలు) కంటే ఎక్కువ నగదు, విలువైన ఆభరణాల వివరాలను ప్రయాణీకులందరూ తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందని కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు యూఏఈలోని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (Federal Authority for Identity and Citizenship, Customs, and Ports Security) ప్రయాణీకులకు రిమైండర్ జారీ చేసింది. సురక్షితమైన ప్రయాణాల కోసం ప్రయాణికులందరూ కస్టమ్స్ చట్టంలో పేర్కొన్న విధంగా కస్టమ్స్ విధానాలకు కట్టుబడి ఉండడం ఎంతో అవసరమని అందులో పేర్కొన్నారు. కాగా, యూఏఈ గుండా వెళ్లే ప్రయాణీకులకు నగదు పరిమితి లేదన్నారు. కానీ, 60వేల దిర్హమ్స్ కంటే ఎక్కువ మొత్తాన్ని తప్పనిసరిగా ప్రకటించాలని అథారిటీ స్పష్టం చేసింది.

ఇక యూఏఈలోని డిస్‌క్లోజర్ విధానం ప్రకారం.. 18ఏళ్లకు పైబడిన ప్రతి కుటుంబ సభ్యుడు కస్టమ్స్‌కు వెల్లడించకుండా 60వేల దిర్హమ్స్‌కు మించకుండా లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని (Foreign Currency) తీసుకువెళ్లే హక్కు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే పిల్లలు, 18ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ప్రయాణీకులు తీసుకువెళ్లే నగదు, ఇతర విలువైన వస్తువులు, వారి పేరెంట్స్ లేదా వారితో పాటు వచ్చే పెద్దవారి పరిమితికి జోడించడం జరగుతుందని చెప్పారు. ఐసీఏ (ICA) వెబ్‌సైట్, స్మార్ట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా నగదు, ఇతర ఆర్థిక సాధనాలు లేదా విలువైన మెటల్స్ వివరాలను వెల్లడించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా యూఏఈ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణీకులు అధికారులకు సహకరించి, తమ జర్నీని సాఫీగా కొనసాగించుకోవచ్చని పేర్నొ్న్నారు. ఈ విధానం ద్వారా అక్రమ మార్గాల్లో నగదు, విలువైన ఆభరణాలు తరలించేవారికి అడ్డుకట్ట వేసే వీలు కలుగుతుందని అధికారులు చెప్పారు.

ఇది కూడా చదవండి: సిగ్నల్ జంప్ చేశారో.. రూ.11.50లక్షలు కడితేగానీ మీ వాహనం మీ చేతికి రాదు.. హడలెత్తిపోతున్న వాహనదారులు!

Updated Date - 2023-02-15T11:47:49+05:30 IST