Congress: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరవుతారు?

ABN , First Publish Date - 2023-10-09T22:33:17+05:30 IST

అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.

Congress: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరవుతారు?

అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకం, అభ్యర్థుల విషయంపై కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో.. ఒపీనియన్ సర్వే ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు పైచేయి సాధిస్తారు? ఏ పార్టీ ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుంది? ఎవరు విజయఢంకా మోగిస్తారు? అనే విషయాలపై సర్వేలు వస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల సంగతి అటుంచితే.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుందని సర్వే ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే తమ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో మరింత బలపడిందని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో 135కి పైగా సీట్లను తమ పార్టీ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. బీజేపీకి ఓటమి తప్పదన్న ఆయన.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా హామీ ఇచ్చారు.


ఈ క్రమంలోనే దిగ్విజయ్ సింగ్‌కి ఓ ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరు అవుతారు?’ అని మీడియా ప్రశ్నించింది. ఇందుకు ఆయన బదులిస్తూ.. సీఎం పదవి పేరును కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయిస్తామని, అయితే కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిగా కమల్‌నాథ్ పేరుని ప్రకటించారు. భోపాల్‌లోని షాజపూర్‌లో జరిగిన ‘కాంగ్రెస్ జన్ ఆక్రోష్ యాత్ర’లో కమల్‌నాథ్ పేరుని ప్రకటించినప్పుడు.. వేదికపై ఉన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

దిగ్విజయ్ ఇంకా మాట్లాడుతూ.. “బీజేపీ తన ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తోంది. ఈ లెక్కన సీన్ నుంచి శివరాజ్ సింగ్ ఔట్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అందుకే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని శివరాజ్ సింగ్ ప్రశ్నిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ‘అవినీతి’ ఒకటని.. తమ ప్రభుత్వం ఏర్పడితే అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు.. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

Updated Date - 2023-10-09T22:33:17+05:30 IST