Karnataka next CM: ముఖ్యమంత్రి ఎవరు?.. ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న

ABN , First Publish Date - 2023-05-14T11:37:02+05:30 IST

ఇప్పుడు ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!?

Karnataka next CM: ముఖ్యమంత్రి ఎవరు?.. ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న

మూడున్నర దశాబ్దాల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీగా సీట్లను సాధించింది. 1989లో జరిగిన ఎన్నికల్లో 224 నియోజక వర్గాలకుగాను 178 స్థానాల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత, 1999లో 132 స్థానాలు గెలుపొందింది. మళ్లీ ఈసారి ఎన్నికల్లో 136 స్థానాలు దక్కడం విశేషం.

ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు. సీఎం రేసులోనే ఉన్న సిద్దరామయ్య కూడా వరుణ స్థానం నుంచి ఘన విజయం నమోదు చేశారు. ఒక దశలో వరుణలో ఆయన గెలుపు ఈసారి కష్టమని గట్టిగా వినిపించింది. ఆయనపై బీజేపీ గృహ వసతి శాఖ మంత్రి సోమణ్ణను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఇక, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ తుమకూరు జిల్లాలోని కొరటగెరె నుంచి; పార్టీలోని లింగాయత్‌ నేత శ్యామనూరు శివశంకరప్ప దావణగెరె నుంచి గెలిచారు. కాగా, మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత పథకాలు కూడా కాంగ్రెస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు; కుటుంబంలో ఒక మహిళకు నెలకు రూ.2000; మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం; గ్రాడ్యుయేట్లకు రూ.3000, డిప్లమో చేసిన వారికి రూ.1500 నిరుద్యోగ భృతి వంటి హామీలు ఆ పార్టీకి ఓట్లను రాల్చాయి. అదే సమయంలో, సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఒక్కుమ్మడిగా వ్యూహాత్మక ప్రచారం సాగించడమూ కలిసొచ్చింది.

మిలియన్ డాలర్ల ప్రశ్న....

ఇప్పుడు ప్రతి ఒక్కరి మదినీ వేధిస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు!? ఐదేళ్లూ పార్టీని తన భుజస్కంధాలపై మోసి.. అనేక కష్టనష్టాలను అనుభవించిన డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓకే చెబుతుందా!? లేక, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు జైకొడుతుందా!? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్‌ ఘన విజయం నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సూచన మేరకు పార్టీ సీనియర్‌ నేతలంతా బెంగళూరులో శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు జరిగింది. ఏకాభిప్రాయ సాధన ఆధారంగా సీఎంను ఎంపిక చేయాలా..? లేదా అధిష్ఠానం సూచన మేరకు ముందుకు సాగాలా..? అనే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉందని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. వారంలోగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-05-14T11:42:05+05:30 IST