Opposition meet : ప్రతిపక్షాలపై ఏఐఎంఐఎం మండిపాటు.. రాజకీయంగా అంటరానివాళ్లమా? అని ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-07-19T12:41:49+05:30 IST

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన 26 పార్టీల కూటమిపై ఏఐఎంఐఎం (AIMIM) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ సారూప్యతగల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామా? అని నిలదీసింది.

Opposition meet : ప్రతిపక్షాలపై ఏఐఎంఐఎం మండిపాటు.. రాజకీయంగా అంటరానివాళ్లమా? అని ఆగ్రహం..

ముంబై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన 26 పార్టీల కూటమిపై ఏఐఎంఐఎం (AIMIM) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ సారూప్యతగల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామా? అని నిలదీసింది. సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరిగిన సమావేశాలకు తమను ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది.

ఏఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బెంగళూరులో సమావేశమైన 26 భావ సారూప్యతగల పార్టీలకు తాము రాజకీయంగా అంటరానివారమయ్యామని వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు మమ్మల్ని పిలవలేదు. వారికి మేం రాజకీయంగా అంటరానివాళ్లమయ్యాం’’ అని చెప్పారు. ‘‘మీకు ముస్లింల ఓట్లు కావాలి. కానీ రాజకీయంగా వారికి ప్రాతినిధ్యంవహించాలని కోరుకోరు. అయినా లౌకికవాదం గురించి మాట్లాడతారు’’ అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్, ఉద్ధవ్ థాకరే, మెహబూబా ముఫ్తీ గతంలో బీజేపీతో కలిసి ఉండేవారని, ఇప్పుడు ఈ ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొన్నారని, వారు అకస్మాత్తుగా లౌకకవాదులైపోయారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పించారని, ఇప్పుడు ఆయనను కూడా ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానించారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కాపాడబడాలని, బీజేపీని ఓడించాలని వారు చెప్తున్నారని; తాము కూడా అదే చెప్తున్నామని తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం తాము ప్రయత్నిస్తున్నామన్నారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి కాకూడదని తాము గట్టిగా కోరుకుంటున్నామని, అందుకోసం కృషి చేస్తున్నామని తెలిపారు. యూపీయేలో తమ పార్టీ భాగస్వామిగా ఉండేదని గుర్తు చేశారు. తమ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు బెంగళూరులో సోమ, మంగళవారాల్లో సమావేశమై, కూటమి పేరును ప్రకటించాయి. భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. దీనికి ‘జీతేగా భారత్’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టాయి. అదేవిధంగా అధికార కూటమి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బిహార్‌లో థర్డ్ ఫ్రంట్?

రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, వారి అభివృద్ధి కోసం కృషి చేయడం లేదని బిహార్ ఏఐఎంఐఎం శాఖ అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ ఆరోపించారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం బిహార్‌‌లో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు.

సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరిగిన సమావేశాలకు హాజరైన 26 పార్టీలకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో 134 స్థానాలు, 35 శాతం ఓట్లు లభించాయి.

ఇవి కూడా చదవండి :

Covid Outbreat : కోవిడ్-19 వైరస్ ప్రారంభంపై అనుమానాలు.. వూహన్ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికా నిధుల నిలిపివేత..

Terror Plot : బెంగళూరులో భారీ ఉగ్ర దాడుల కుట్ర భగ్నం

Updated Date - 2023-07-19T12:41:49+05:30 IST