Hamas - Israel War : రాకెట్ల రణం... హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ యుద్ధం

ABN , First Publish Date - 2023-10-08T03:53:48+05:30 IST

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం మొదలైంది. శనివారం ఉదయం నుంచి రాకెట్ల రణం.. నెత్తుటి ప్రవాహం కొనసాగింది.

Hamas - Israel War : రాకెట్ల రణం... హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ యుద్ధం

హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ యుద్ధం

7 వేల రాకెట్లు ప్రయోగించిన ఉగ్ర సంస్థ

ఇజ్రాయెల్‌ ప్రతిదాడి

రాకెట్ల వరద.. నెత్తుటి ప్రవాహం

ఇరువైపులా 400 మంది పైగా మృతి!

2 వేల మందికి పైగా క్షతగాత్రులు

యుద్ధంలో ఉన్నాం: ప్రధాని నెతాన్యాహు

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం: మోదీ

ఇళ్లు వీడొద్దని భారతీయులకు సలహా

ఇజ్రాయెల్‌కు బాసటగా ప్రపంచ దేశాలు

జెరూసలేం, అక్టోబరు 7: ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం మొదలైంది. శనివారం ఉదయం నుంచి రాకెట్ల రణం.. నెత్తుటి ప్రవాహం కొనసాగింది. పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌-- హరాకత్‌ అల్‌-ముక్వామా అల్‌-ఇస్లామియా(హమాస్‌) శనివారం ఉదయం ‘ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌’ పేరుతో ఇజ్రాయెల్‌పై సుమారు 7 వేల రాకెట్లతో ముప్పేట దాడి జరిపింది. ఇజ్రాయెల్‌ కూడా అందుకు దీటుగా ‘ఆపరేషన్‌ స్వార్డ్స్‌ ఆఫ్‌ ఐరన్‌’ పేరుతో రక్తపుటేరులను పారించింది. గాజాపై బాంబుల వర్షం కురిపించింది. దొరికిన హమాస్‌ ఉగ్రవాదులను దొరికినట్లు ఊచకోత కోసింది.

ఇజ్రాయెల్‌ పౌరులు యూదుల పర్వదినాలైన సిమ్చాట్‌ టోరా, యోమ్‌కిప్పుర్‌, హిబ్రూ షబ్బత్‌ వేడుకల్లో మునిగి ఉండగా.. హమాస్‌ ఉగ్రవాదులు ఒక్కసారిగా రాకెట్లతో విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం 6.30 గంటలకు సముద్రమార్గం, గగనతలంతోపాటు.. సరిహద్దుల్లోని ఫెన్సింగ్‌ను ఎక్స్‌కవేటర్లతో కూల్చివేసి.. ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకువచ్చారు. ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయారు. ఆ తర్వాత 5 వేల నుంచి 7 వేల రాకెట్లతో బీభత్సం సృష్టించారు. దీంతో.. దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగింది. సరిహద్దుల్లోని జెరూసలేం, టెల్‌అవీవ్‌, రామ్లాలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలోని ఓ పోలీ్‌సస్టేషన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హమాస్‌ టెర్రరిస్టులు.. వీధుల్లో పౌరులను కనిపించిన వారిని కనిపించినట్లు మెషీన్‌ గన్లతో కాల్చి చంపారు. ఈ ఘటనల్లో 200 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరో 800 మంది గాయాలపాలయ్యారని, వారిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.

హమాస్‌ ఉగ్రవాదులు మహిళలను, 35 మంది సైనికులను అపహరించారని పేర్కొంది. సరిహద్దుల్లో ఉండే 17 మంది నేపాల్‌ జాతీయులను కూడా హమాస్‌ ఉగ్రవాదులు అపహరించారు. మోటార్‌ సైకిళ్లు, జీపులు, పడవల్లో మహిళలను అపహరిస్తూ.. వారిని గాజాకు తీసుకువెళ్లి.. అవమానకరంగా ప్రవర్తించిన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఓ మహిళా మిలటరీ అధికారిని గాజాకు తీసుకెళ్లి.. అక్కడ ఆమెను వివస్త్రను చేసి, నినాదాలు చేశారు. పారాగ్లైడర్లతో ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్‌ ఉగ్రవాదులు.. సరిహద్దుల్లోని మిలటరీ క్యాంప్‌సను తమ అధీనంలోకి తీసుకుని, ఆర్మీ వాహనాలను అపహరించారు. వాటిల్లో తిరుగుతూనే.. వీధుల్లో పౌరులపై కాల్పులు జరిపారు. ఈ పరిస్థితిని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యాహు తీవ్రంగా పరిగణించారు. తాము యుద్ధంలో ఉన్నట్లు ఓ వీడియో సందేశంలో తెలిపారు.

హమా్‌సలు తీవ్ర మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంత సేపటికే.. ఇజ్రాయెల్‌ సైన్యం ‘ఆపరేషన్‌ స్వార్డ్స్‌ ఆఫ్‌ ఐరన్‌’ పేరుతో కౌంటర్‌ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ పోలీసులు కూడా ఉగ్రవాదులపై ప్రతిదాడులకు దిగారు. తాజా పరిణామాలతో.. ఇజ్రాయెల్‌లో యుద్ధమేఘాలు అలుముకున్నాయని సైన్యం ప్రకటించింది. హమాస్‌ ఉగ్రవాదులు 5 వేల దాకా రాకెట్లతో దాడి చేశారని, తమ డిఫెన్స్‌ వ్యవస్థలు 2,500 రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేశాయని చెప్పింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరికలు చేసినట్లు వివరించింది. ఉదయం 10 గంటల సమయం నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం కౌంటర్‌ అటాక్‌ ఊపందుకుంది. మధ్యాహ్నానికి వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో.. గాజా, గాజాస్ట్రి్‌పపై బాంబుల వర్షం కురిసింది. ఈ దాడుల్లో అక్కడి ‘పాలస్తీనా టవర్‌’ నేలమట్టమవుతున్న దృశ్యాలను ‘అల్‌జజీరా’ న్యూస్‌చానల్‌ ప్రసారం చేసింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఓ ఆస్పత్రి ధ్వంసమైందని, నగరవ్యాప్తంగా 230 మంది మృతిచెందారని, 1600 మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌

హమాస్‌ నేత.. ఆక్రమిత గాజాస్ట్రిప్‌ ప్రభుత్వాధినేత మొహమ్మద్‌ డెయిఫ్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని ప్రకటించారు. శనివారం తెల్లవారుజామునే ‘ఆపరేషన్‌ అల్‌-అక్సార స్టామ్‌’ ప్రారంభమైందని పేర్కొన్నారు. గతంలో డెయి్‌ఫపై అనేకసార్లు దాడులు జరగడంతో ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పుడు వీడియో సందేశాన్ని విడుదల చేయడాన్ని బట్టి.. హమా్‌స యుద్ధానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం

ఇజ్రాయెల్‌ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ.. ఆ దేశానికి అండగా ఉంటామని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యా’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు అక్కడి ఇండియన్‌ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

ప్రపంచ దేశాల ఖండన

ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడి దిగ్ర్భాంతికరమని.. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉందని.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు పేర్కొన్నారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగావ్‌ ఇరువైపులా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఐరోపా సమాఖ్యతోపాటు.. జర్మనీ, రష్యా, ఉక్రెయిన్‌, బెల్జియం, గ్రీస్‌ దేశాలు కూడా హమా్‌సల దాడిని ఖండించాయి.

నిఘా వైఫల్యంతో భారీ మూల్యం

ఇజ్రాయెల్‌.. శనివారం నాటి హమాస్‌ దాడి ప్రణాళికలను ముందే పసిగట్టడంలో విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిహద్దు మొత్తాన్ని అనుక్షణం వీక్షించేలా ఇన్‌స్టాల్‌ చేసిన సీసీకెమెరాల కళ్లుగప్పి ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ చరిత్రలోనే అతిపెద్ద చొరబాటుకు పాల్పడ్డారు. హమాస్‌ ఉగ్రవాదులు పారాగ్లైడర్లతో ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించినా. సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ను తొలగించినా.. నిఘావర్గాలు గుర్తించకపోవడం గమనార్హం..! నిఘావైఫల్యంతో ఇజ్రాయెల్‌ భారీ మూల్యాన్ని చెల్లించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరీ హమాస్‌ ఉగ్రవాదులు

హమాస్‌ సంస్థ ఇస్లాం పరిరక్షణ ఉద్యమం పేరుతో 1987లో ఏర్పాటైంది. పాలస్తీనాకు మద్దతుగా నిలబడింది. అప్పట్లో పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పీఎల్‌వో) చీఫ్‌ మహమూద్‌ అబ్బాస్‌ హమా్‌సకు నేతృత్వం వహించారు. 2006లో పాలస్తీనా పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. అయితే.. అబ్బా్‌సపై కుట్రదారు అనే ఆరోపణలు రావడంతో.. హమా్‌సలు 2007లో గాజాస్ట్రిప్‌ ప్రాంతాన్ని ఆక్రమించారు.

Updated Date - 2023-10-08T07:41:35+05:30 IST