Sanatan Dharma : ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై యూపీలో కేసు నమోదు

ABN , First Publish Date - 2023-09-06T12:45:57+05:30 IST

మతపరమైన మనోభావాలను గాయపరచారనే ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Sanatan Dharma : ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై యూపీలో కేసు నమోదు
Udayanidhi Stallin, Priyank Kharge

లక్నో (ఉత్తర ప్రదేశ్) : మతపరమైన మనోభావాలను గాయపరచారనే ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ తమ మనోభావాలను దెబ్బతీశారని న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోఢీ చేసిన ఫిర్యాదులపై ఈ చర్య తీసుకున్నారు.

‘సనాతన ధర్మ నిర్మూలన’ పేరుతో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం చెన్నైలో గత వారం ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. వీటిని కేవలం వ్యతిరేకించలేమని, అంతం చేయాలని, నిర్మూలించాలని, అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని అన్నారు. దీనిపై వివాదం రేగిన తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. మరోవైపు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు) మాట్లాడుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతిచ్చారు. సమానత్వాన్ని ప్రోత్సహించని ఏ మతమైనా, మానవుడిగా హుందాగా జీవించేందుకు భరోసానివ్వని ఏ మతమైనా, తన దృష్టిలో మతం కాదని చెప్పారు.

ఉదయనిధి, ప్రియాంక్ వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోఢీ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి వ్యాఖ్యలతో కూడిన మీడియా కథనాలను ఫిర్యాదులకు జత చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్ పోలీసులు ఈ ఫిర్యాదులను స్వీకరించి, ఉదయనిధి, ప్రియాంక్‌లపై బుధవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153ఏ (వేర్వేరు మత సముదాయాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), ఐపీసీ సెక్షన్ 295ఏ (మతపరమైన మనోభావాలను భంగపరచేందుకు ఉద్దేశపూర్వకంగా, దుశ్చర్యలకు పాల్పడటం) ప్రకారం ఆరోపణలను నమోదు చేశారు.

ఇదిలావుండగా, ఉదయనిధి స్టాలిన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ దాదాపు 260 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో విశ్రాంత న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.


ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?

India : ‘ఇండియా’ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేనా?

Updated Date - 2023-09-06T12:45:57+05:30 IST