Enemy Properties : శత్రు ఆస్తుల అమ్మకం ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-19T16:14:46+05:30 IST

పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వం స్వీకరించినవారు మన దేశంలో వదిలిపెట్టిన స్థిరాస్తులను ఖాళీ చేయించి, వాటిని విక్రయించే ప్రక్రియను

Enemy Properties : శత్రు ఆస్తుల అమ్మకం ప్రారంభం
Union Home ministry

న్యూఢిల్లీ : పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వం స్వీకరించినవారు మన దేశంలో వదిలిపెట్టిన స్థిరాస్తులను ఖాళీ చేయించి, వాటిని విక్రయించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇటువంటి ఆస్తులను శత్రు ఆస్తులు (Enemy Properties) అంటారు. మన దేశంలో మొత్తం మీద 12,611 శత్రు ఆస్తులు ఉన్నాయని, వాటి విలువ రూ.1 లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

శత్రు ఆస్తుల చట్టం ప్రకారం ఏర్పాటైన కస్టోడియన్ పరిధిలో ఈ ఆస్తులు ఉంటాయి. ఈ అథారిటీని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (CEPI) అంటారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, శత్రు ఆస్తుల అమ్మకాలకు సంబంధించిన మార్గదర్శకాలు మారినట్లు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ సహాయంతో శత్రు ఆస్తులను ఖాళీ చేయించే ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది.

రూ.1 కోటి కన్నా తక్కువ విలువైన శత్రు ఆస్తులను అమ్మకానికి పెట్టినపుడు, దానిని స్వాధీనంలో ఉంచుకున్నవారు దానిని కొనేందుకు కస్టోడియన్ అవకాశం ఇస్తారని తెలిపింది. ఆ వ్యక్తి ఆ ఆస్తిని కొనేందుకు తిరస్కరిస్తే, మార్గదర్శకాలలో నిర్దేశించిన విధంగా ఆ ఆస్తిని విక్రయించే ప్రక్రియను కస్టోడియన్ ప్రారంభించాలని తెలిపింది.

శత్రు ఆస్తి విలువ రూ.1 కోటి నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటే, దానిని ఈ-వేలం విధానంలో సీఈపీఐ విక్రయించాలని, లేదంటే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా విక్రయించాలని తెలిపింది. శత్రు ఆస్తుల అమ్మకాల కమిటీ నిర్ణయించిన ధరకు విక్రయించాలని పేర్కొంది.

ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సీఈపీఐ ఈ-ఆక్షన్ నిర్వహించాలని తెలిపింది.

కంపెనీల్లో షేర్లు, బంగారం వంటి శత్రు ఆస్తులను అమ్మడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,400 కోట్లు లభించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

20 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శత్రు ఆస్తులను గుర్తించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ అధ్యయనాన్ని నిర్వహించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (DGDE) ఇటువంటి ఆస్తుల ప్రస్తుత పరిస్థితిని, విలువను అంచనా వేస్తుంది. 12,485 శత్రు ఆస్తులు పాకిస్థానీలకు చెందినవని, 126 శత్రు ఆస్తులు చైనీయులకు చెందినవని గుర్తించారు.

ఇవి కూడా చదవండి :

Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌పై మరో వేటుకు రంగం సిద్ధం?

Updated Date - 2023-03-19T16:14:46+05:30 IST