Share News

Uddhav Shiv sena: సింహభాగం సీట్లు మాకేనంటున్న శివసేన.. డిఫెన్స్‌లో కాంగ్రెస్..!

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:38 PM

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 23 సీట్లలో తాము పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం శుక్రవారం మరోసారి తేల్చిచెప్పింది. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఎక్కువ సీట్లలోనే పోటీ చేస్తూ వస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Uddhav Shiv sena: సింహభాగం సీట్లు మాకేనంటున్న శివసేన.. డిఫెన్స్‌లో కాంగ్రెస్..!

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర (Maharashtra Loksabha polls) నుంచి 23 సీట్లలో తాము పోటీ చేస్తామని శివసేన ఉద్ధవ్ థాకరే (UBT) వర్గం శుక్రవారం మరోసారి తేల్చిచెప్పింది. ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఎక్కువ సీట్లలోనే పోటీ చేస్తూ వస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రంలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. గంపగుత్తగా 23 సీట్లను శివసేన యూబీటీ కోరుతోందంటూ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ చేసిన వ్యాఖ్యలపై రౌత్ మాట్లాడుతూ, ఎవరో అంతగా ప్రాముఖ్యం లేని వ్యక్తుల మాటలు పట్టించుకోనవసరం లేదని అన్నారు.


''ఇది మహారాష్ట్ర. ఇక్కడ శివసేన పెద్ద పార్టీ. కాంగ్రెస్ జాతీయ పార్టీ. రాహుల్, సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో సహా కీలక నేతలతో ఉద్ధవ్ థాకరే సానుకూల చర్చలు జరుపుతున్నారు'' అని రౌత్ చెప్పారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా గెలుచుకోని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడి నుంచే (జీరో) ఎన్ని సీట్లు షేర్ చేయాలనే చర్చ ఉంటుందన్నారు. శివసేన ప్రతిసారి 23 సీట్లలో పోటీ చేస్తు్న్న విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నామన్నారు. ఈ విషయమై మరోసారి చర్చలు జరపాలని ఇండియా కూటమి సమావేశంలో కూడా తాము నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే 'మహా వికాస్ అఘాడి'లో కాంగ్రెస్ తమ కీలక భాగస్వామి అని ఆయన చెప్పారు.


22 సీట్లు డిమాండ్ చేయనున్న కాంగ్రెస్

కాగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర పార్టీ విభాగంతో న్యూఢిల్లీలో శుక్రవారంనాడు సమావేశమైంది. అశోక్ చవాన్, పృధ్వీరాజ్ చవాన్, నానా పటోలే, బాలాసాహెబ్ ధోరట్, విజయ్ వాడెట్టివార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌సీపీ, శివసేన, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో 22 సీట్లు కోసం కాంగ్రెస్ డిమాండ్ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Dec 29 , 2023 | 06:38 PM