NCP Vs BJP: 2024లో మరాఠా పీఠం మాదే: శరద్‌పవార్

ABN , First Publish Date - 2023-07-06T21:48:05+05:30 IST

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు.బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూపు నేతలపై వేటు వేశారు. అంతేకాదు.. 2024 అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.

NCP Vs BJP: 2024లో మరాఠా పీఠం మాదే: శరద్‌పవార్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్(Ajit Pawar) తిరుగుబాటు తర్వాత శరద్ పవార్(Sharad Pawar) యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. జూలై5న జరిగిన సమావేశం ముగిసిన వెంటనే శరద్ పవార్ ఈరోజు జూలై 6న ఢిల్లీలో మరోసారి జాతీయ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. బీజేపీ(BJP)తో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూపు సీనియర్ నేతలపై వేటు వేశారు. అంతేకాదు.. ఈ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో 2024 అసెంబ్లీ ఎన్నికల(2024 Assembly Elections)పై శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో శరద్ పవార్‌ను కలిశారు. విపక్షాల ఐక్యత, ఎన్సీపీ రాజకీయ సంక్షోభంపై చర్చించారు.

తిరుగుబాటు నేతలపై శరద్ పవార్

ఢిల్లీలో ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమవేశం నిర్వహించిన శరద్ పవార్.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఎస్.ఆర్.కోహ్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో పాటు అజిత్ పవార్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. కొందరు సహచరులు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే పని చేశారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని శరద్ పవార్ మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశంలో 8 తీర్మానాలను ఆమోదించారు. జాతీయ కార్యవర్గం శరద్ పవార్‌పై పూర్తి విశ్వాసం కలిగి ఉంది. శరద్ పవార్ ఎన్‌సిపి ప్రధాన నాయకుడని కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు.

Sharad-pawar.jpg

విపక్షాల ఐక్యత, ఎన్సీపీ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, శరద్ పవార్‌‌తో సమావేశమయ్యారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. పవార్‌కు రాహుల్ తన మద్దతు తెలిపినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది.. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని..బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై పవార్‌తో రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది.

rahul.jpg

ఎన్నికల కమిషన్‌పై శరద్ పవార్ ఏమన్నారంటే..

ఎన్నికల కమిషన్‌కు అజిత్ పవార్ చేసిన దరఖాస్తుపై శరద్ పవార్ స్పందిస్తూ..ఎన్నికల సంఘంపై తనకు నమ్మకం ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్‌‌పై నమ్మకం ఉందంటూనే.. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని వెల్లడించారు. ‘‘ఆయనకు 82, 92 ఏళ్లు’’ అన్న అజిత్ పవార్ వ్యాఖ్యలపై శరద్ పవార్ ఘాటుగానే స్పందించారు. ‘‘వయసెంత అన్నది ముఖ్యం కాదు.. నేను పోరాడగలుగుతున్నాను. ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నానని శరద్ పవార్ అన్నారు. బీజేపీ ఏ ఆట ఆడినా బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. 2024లో రాష్ట్ర ప్రజలు ఎన్సీపీకి అధికారం కట్టబెడతారని శరద్ పవార్ అన్నారు.

కాగా..శరద్ పవార్ పిలిచిన సమావేశంపై అజిత్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందని అజిత్ పవార్ ప్రకటించారు.

Updated Date - 2023-07-06T21:58:29+05:30 IST