Share News

Supriya Sule: అస్సాం సీఎం హిమంతకి సుప్రియా దిమ్మతిరిగే కౌంటర్.. మహిళల్ని అవమానపరచడం బీజేపీకి అలవాటే!

ABN , First Publish Date - 2023-10-19T18:27:43+05:30 IST

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొంతకాలం నుంచి తన నోటికి బాగానే పని చెప్తున్నారు. ఒక సీఎంగా తన రాష్ట్ర బాగోగులు చూసుకోవడం కన్నా.. ప్రత్యర్థి నేతలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరేం మాట్లాడినా సరే..

Supriya Sule: అస్సాం సీఎం హిమంతకి సుప్రియా దిమ్మతిరిగే కౌంటర్.. మహిళల్ని అవమానపరచడం బీజేపీకి అలవాటే!

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొంతకాలం నుంచి తన నోటికి బాగానే పని చెప్తున్నారు. ఒక సీఎంగా తన రాష్ట్ర బాగోగులు చూసుకోవడం కన్నా.. ప్రత్యర్థి నేతలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరేం మాట్లాడినా సరే.. దానికి కౌంటర్ ఇవ్వాలన్న ఆతృతతో మీడియా ముందుకొచ్చేసి, హద్దూఅదుపూ లేని వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అంశంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సీన్‌లోకి ఆయన కుమార్తె సుప్రియా సులేని తీసుకొచ్చారు. అసలు ఏమాత్రం సంబంధం లేని ఆమెని వివాదంలోకి లాగి, గౌరవం లేకుండా విమర్శలు గుప్పించారు. దీంతో.. సుప్రియా తనదైన శైలిలో ఆ సీఎంకి, బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


అసలు విషయం ఎక్కడ మొదలైంది?

ఇటీవల ముంబైలోని ప్రాంతీయ కార్యాలయంలో అధికారుల సమావేశం జరగ్గా.. అందులో శరద్ పవార్ పాలస్తీనాకు తన మద్దతు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రపంచ శాంతికి ముప్పు అని పేర్కొన్న ఆయన.. అక్కడి భూమి, ఇళ్లు పాలస్తీనాకు చెందినవని, వాటిని ఇజ్రాయెల్ ఆక్రమించిందని చెప్పారు. పాలస్తీనాకు సహాయం చేయడంలో దేశ మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్ర ఉందని గుర్తు చేశారు. కానీ.. ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం దురదృష్టవశాత్తు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చి, భారత మూలాల్ని వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు. గత నాయకుల వైఖరి, శ్రామిక ప్రజలకు అనుకూలంగా తమ ఎన్సీపీ పార్టీ ఉందని శరద్ పవార్ స్పష్టం చేశారు.

పవార్ వ్యాఖ్యలపై హిమంత స్పందన

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల విషయమై హిమంతను మీడియా ప్రశ్నించగా.. అందుకు ఆయన జుగుప్సాకరమైన స్పందన ఇచ్చారు. సీన్‌లోకి సుప్రియా సూలేని తీసుకొచ్చారు. ‘‘గాజాలో హమాస్ కోసం పోరాడేందుకు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేని పంపుతారని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అది కూడా.. ఏమాత్రం సంబంధం లేని సుప్రియాని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం మరింత దారుణం. దీన్ని బట్టి.. హిమంత బీజేపీ మెప్పు పొందడం కోసం ఎంతకైనా దిగజారుతారని అర్థం చేసుకోవచ్చు.

సుప్రియా సూలే ఇచ్చిన కౌంటర్

తన ప్రమేయం ఏమాత్రం లేకపోయినా.. ఈ వ్యవహారంలో తన పేరుని తీసుకురావడంపై సుప్రియా సూలే తనదైన శైలిలో హిమంతకు చురకలంటించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తన స్నేహితుల్లో హిమంత ఒకరని.. ఆయన ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో తాము కాంగ్రెస్‌లో కలిసి పని చేశామని, అలాంటి హిమంత తనపై ఈ తరహా ప్రకటన చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. అయినా.. బీజేపీకి మహిళల్ని అవమానించడం, అగౌరపరచడం అలవాటేనని నిప్పులు చెరిగారు. అసలు శరద్ పవార్ చెప్పారో బీజేపీ ఐటీ సెల్ అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

Updated Date - 2023-10-19T18:27:43+05:30 IST