Share News

Shivanand Patil: రుణమాఫీ కోసం రైతులు ఆ పని చేస్తారంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్లు

ABN , Publish Date - Dec 25 , 2023 | 05:37 PM

కర్ణాటక మంత్రి శివానంద పాటిల్‌ తాజాగా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రుణాల్ని ప్రభుత్వాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా వాళ్లు కరువుని కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. ఓ కార్యక్రమంలో శివానంద పాటిల్ మాట్లాడుతూ..

Shivanand Patil: రుణమాఫీ కోసం రైతులు ఆ పని చేస్తారంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్లు

Shivanand Patil On Farmers: కర్ణాటక మంత్రి శివానంద పాటిల్‌ తాజాగా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రుణాల్ని ప్రభుత్వాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా వాళ్లు కరువుని కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. ఓ కార్యక్రమంలో శివానంద పాటిల్ మాట్లాడుతూ.. ‘‘రైతులకు నీరుతో పాటు విద్యుత్తు ఉచితంగా లభిస్తోంది. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు సహకారం అందించారు. విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించారు. అయితే.. రైతుల మనసులో మాత్రం ‘ప్రతి ఏటా కరవు రావాలనే’ కోరిక ఉంటుంది. ఎందుకంటే.. కరువు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేస్తుందని వాళ్లు భావిస్తున్నారు. కానీ.. రైతులు ఇలా కోరుకోవడం ఏమాత్రం సరికాదు’’ అని అన్నారు.


ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ మంత్రిపై, కర్ణాటక కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రైతులను అవహేళన చేసేలా శివానంద మాట్లాడారని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌‌ అంతా మూర్ఖులతో నిండిపోయిందని దుయ్యబట్టింది. ‘‘ఇది రైతు వ్యతిరేకత ప్రభుత్వం’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారపట్టింది. సిద్ధరామయ్య కూడా సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరింది. గతంలో నష్టపరిహార డబ్బుల కోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పిన శివానంద.. ఇప్పుడు కరువు కోసం రైతులు ఎదురుచూస్తారంటూ వారిని అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిందని బీజేపీ మండిపడింది. రైతులు ఏనాడూ కరువు కోసం ఎదురుచూడలేదని కౌంటర్ ఎటాక్ చేసింది.

కాగా.. శివానంద పాటిల్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రైతు ఆత్మహత్యల్ని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు అందించే నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచిన తర్వాత.. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని అన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం కోరడంలో తప్పు లేదు కానీ.. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సహాయం కోసం సహజ మరణాలను కూడా ఆత్మహత్యలుగా చూపిస్తున్నారని గతంలో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. ఆ తర్వాత మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. రైతుల మనోభావాలను దెబ్బతీయాలని తాను భావించడం లేదని, రైతుల ఆత్మహత్యల సంఖ్యను నివేదించే ముందు డేటా కోసం వేచి ఉండాలని తాను మీడియాకు సలహా ఇస్తున్నానని చెప్పారు.

Updated Date - Dec 25 , 2023 | 05:37 PM