Shashi Tharoor: ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కి మారేందుకే ఈ హంగామా.. శశి థరూర్ సెటైర్లు

ABN , First Publish Date - 2023-09-18T21:46:10+05:30 IST

ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినున్నట్టు ప్రకటించినప్పుడు.. అజెండా ఏంటి? అనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగాయి. అజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు...

Shashi Tharoor: ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కి మారేందుకే ఈ హంగామా.. శశి థరూర్ సెటైర్లు

ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినున్నట్టు ప్రకటించినప్పుడు.. అజెండా ఏంటి? అనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగాయి. అజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా.. కేంద్రం మాత్రం మౌనం పాటిస్తూ వచ్చింది. ఇప్పుడు తొలిరోజు సెషన్స్ ముగిసిన అనంతరం.. దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ తాజాగా స్పందించారు. ఇన్నాళ్లూ అజెండా చెప్పకుండా వాళ్లు అయోమయంలో పడేశారని.. అయితే తొలిరోజు సెషన్స్ తర్వాత ఆ మిస్టరీకి తెరపడిందని అన్నారు. కేవలం పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారేందుకే ఇంత హడావుడి చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు.

సోమవారం శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు చెప్తూ వస్తున్న బిల్లులను తర్వాత ప్రవేశపెట్టొచ్చు కదా.. ఇప్పటికిప్పుడు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏంటి? అని మొదటి నుంచి మేము అయోమయంలో ఉన్నాం. అయితే.. ఈరోజు ఈ సమావేశాల వెనుక గల కారణం ఏంటో స్పష్టమైంది. పాత భవనంలో నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని ప్రభుత్వాన్ని చాలా ప్రత్యేకంగా మలచాలని అనుకుంది. వారి లక్ష్యం ఏంటో మాకు అర్థమైంది’’ అని అన్నారు.


అనంతరం.. పాత భవనంలో పార్లమెంటరీ కార్యక్రమాలు చివరిసారిగా జరగడంపై ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర, జ్ఞాపకాలతో నిండిన భవనాన్ని విడిచిపెట్టడం ఎప్పుడూ ఎమోషనల్‌గా ఉంటుందని అన్నారు. ‘‘ప్రధాని మోదీ చెప్పినట్లు ఈ భవనం ఎన్నో జ్ఞాపకాలు, చరిత్రను కలిగి ఉంది. ఈ భవనాన్ని విడిచిపెట్టడం నిజంగా విచారకరమైన క్షణం. కొత్త భవనంలో మెరుగైన సౌకర్యాలు, కొత్త సాంకేతికత, పార్లమెంటు సభ్యులకు మరింత సౌకర్యాలు ఉండాలని ఆశిద్దాం’’ అని శశి థరూర్ తెలిపారు.

ఇదిలావుండగా.. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సెషన్స్ పాత పార్లమెంట్ భవనంలో జరగ్గా.. రెండో రోజు నుంచి ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మోదీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నామని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు.

Updated Date - 2023-09-18T21:46:10+05:30 IST