Caste Census : నితీశ్ కుమార్‌ను ప్రశంసించిన అఖిలేశ్ యాదవ్
ABN , First Publish Date - 2023-01-22T15:08:03+05:30 IST
కులాలవారీ జనాభా లెక్కల సేకరణను ప్రారంభించినందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)ను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్
లక్నో : కులాలవారీ జనాభా లెక్కల సేకరణను ప్రారంభించినందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)ను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ప్రశంసించారు. బ్రిటిష్ పాలకులు 1931లో ఈ అంశంపై ఆలోచించారని చెప్పారు. దీనివల్ల అన్ని కులాల అభివృద్ధి జరుగుతుందన్నారు.
జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మీడియాతో మాట్లాడుతూ, కులాలవారీ జనాభా లెక్కల సేకరణ జరగడం లేదన్నారు. కుల గణన (Caste Census) చేయాలని 1931లో బ్రిటిష్ పాలకులు ప్రయత్నించారని చెప్పారు. వివిధ కులాలకు రాజ్యాంగ హక్కులను కల్పించాలంటే, వారి లెక్కలు తెలియాలన్నారు. ఈ విషయంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను అభినందిస్తున్నానని, మెచ్చుకుంటున్నానని తెలిపారు.
కుల గణన జరగాలని సమాజ్‌వాదీ పార్టీ కూడా చాలా కాలం నుంచి కోరుతోందన్నారు. ఇది తమ ఎన్నికల హామీ కూడానని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు నెలల్లోగా కులాలవారీ జనాభా లెక్కల సేకరణను ప్రారంభిస్తామని హామీ ఇచ్చామన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) సభలో పాల్గొనడం గురించి మాట్లాడుతూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) ఆహ్వానం మేరకు తాను వెళ్లానని, ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచారని చెప్పారు.
బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఇక కేవలం 398 రోజులు మాత్రమే మిగిలాయన్నారు. పేదలైనా, మరొకరైనా నేడు న్యాయాన్ని ఆశించలేకపోతున్నారన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా లాక్కొంటున్నారన్నారు. బీజేపీ (BJP) ఉద్దేశపూర్వకంగానే కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. అన్ని వ్యవస్థల్లోకీ తన మనుషులను చొప్పిస్తోందన్నారు.